బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య?
వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యను ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యను ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తాజా రాజకీయాలు నేపథ్యంలో తిరిగి రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్గన్పూర్ సెట్టింగ్ ఎమ్మెల్యే స్థానం అయినప్పటికీ టికెట్ ఇవ్వకపోవడంతో అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. గత నెల మూడో తేదీన రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ నేతలతోనూ భేటీ అయ్యారు. అయినప్పటికీ ఇంకా కాంగ్రెస్‌లో చేరలేదు. కావ్యతో పాటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం పార్టీ మారుతుండటంతో తిరిగి గులాబీ పార్టీలోకి వస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో రాజయ్య కేసీఆర్తో భేటీ అవుతున్నట్లు సమాచారం. వరంగల్ పార్లమెంట్ పరిధిలో తాజా రాజకీయాలు చర్చించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బాబు మోహన్, పెద్ది స్వప్న, తదితర పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ తాటికొండ వైపు ముగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.