అది కస్టోడియల్ మరణమే!

తుకారాంగేట్ పోలీసుల అదుపులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన చిరంజీవిది కస్టోడియల్ డెత్ అని తెలిసింది.

Update: 2023-05-03 08:58 GMT

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: తుకారాంగేట్ పోలీసుల అదుపులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన చిరంజీవిది కస్టోడియల్ డెత్ అని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం విచారణ పేరుతో పోలీసులు కొట్టటం వల్లనే అతను చనిపోయినట్టు సమాచారం. ఓ సెల్ ఫోన్ చోరీ కేసులో ఇటీవల తుకారాంగేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి చిరంజీవి పోలీస్ స్టేషన్‌లో కుప్పకూలిపోయాడు. గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా అదేరోజు రాత్రి చనిపోయాడు. దాంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన జరిపారు. మీడియాలో దీనికి సంబంధించి వార్తలు రావటంతో హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. చిరంజీవి మరణంపై సికింద్రాబాద్ కోర్టును ఆదేశించింది.

స్టేట్మెంట్ల నమోదు..

ఈ క్రమంలో ఇప్పటికే సికింద్రాబాద్ కోర్టు చిరంజీవి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లను నమోదు చేసింది. దాంతోపాటు చిరంజీవిని అతని ఇంటి నుంచి తీసుకెళ్లిన కానిస్టేబుళ్లు, సీఐల వాంగ్మూలాలను కూడా రికార్డు చేసింది. గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ హెచ్ఓడి కృపాల్ సింగ్‌ను కూడా కోర్టుకు పిలిపించి ఆయన స్టేట్మెంట్‌ను కూడా కోర్టు నమోదు చేసింది. కాగా... విచారణ పేరుతో కొట్టటం వల్లనే చిరంజీవి చనిపోయినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ కారణం వల్లనే చిరంజీవి ముక్కు, చెవుల నుంచి రక్తం కారిందని ఆ వర్గాలు తెలిపాయి. దీనిపై గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వర్గాలతో మాట్లాడగా.. ఇంకో వారంలో పోస్ట్‌మార్టం నివేదిక వస్తుందని చెప్పారు. అప్పుడు చిరంజీవి మరణానికి కారణాలు స్పష్టం అయితాయన్నారు.

Tags:    

Similar News