TGSRTC: ఆర్టీసీ అద్దె బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి.. స్పందించిన మంత్రి పోన్నం
ఆర్టీసీ అద్దెబస్సు ప్రమాదంలో ముగ్గురు మరణించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ అద్దెబస్సు ప్రమాదంలో ముగ్గురు మరణించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బస్సు ప్రమాదంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ అద్దె బస్సులో ప్రయాణిస్తోన్న ముగ్గురు దుర్మరణం చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘోరప్రమాదం గురించి తెలియగానే తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యానని తెలిపారు.
మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఈ ప్రమాదంపై పోలీస్, ఆర్టీసీ అధికారుల నుంచి ఆరా తీశానని, వావివాల వద్ద ఆర్టీసీ బస్సు మూల మళ్లుతుండగా ఎదురుగా లారీ వేగంగా దూసుకు వచ్చి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వారు చెబుతున్నారని అన్నారు. అంతేగాక ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని మంత్రి పొన్నం తెలియజేశారు.