యూపీఎస్సీ కమిషన్ తో టీజీపీఎస్సీ కమిషన్ భేటీ
యూపీఎస్సీకి దీటుగా టీజీపీఎస్సీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు ఢిల్లీకి పయనమయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: యూపీఎస్సీకి దీటుగా టీజీపీఎస్సీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు ఢిల్లీకి పయనమయ్యారు. కాగా తొలిరోజు పర్యటనలో భాగంగా ఢిల్లీలో బుధవారం యూపీఎస్సీ కమిషన్ సభ్యులను వారు కలిశారు. యూపీఎస్సీ చైర్ పర్సన్ ప్రీతి సుదాన్ తో పలు అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు టీజీపీఎస్సీ సభ్యులు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు విభాగాల జాయింట్ సెక్రటరీలు వివరించినట్లు పేర్కొన్నారు. యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ ఫూల్‌ప్రూఫ్ పద్ధతిలో జరుగుతుందని, దీనికి అనుసరిస్తున్న వివిధ పద్ధతులు, అవలంభించిన ప్రక్రియలను వారు వివరించినట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాన్ని యూపీఎఏస్సీ నిర్వహించడం మొదటిసారని టీజీపీఎస్సీ సభ్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. టీజీపీఎస్సీ ఏడాదిలో సగటున 13 వేల ఉద్యోగాలు భర్తీ చేయడంపై యూపీఎస్సీ కమిషన్ అభినందించినట్లు వారు పేర్కొన్నారు. టీజీపీఎస్సీ సభ్యుల పర్యటన గురువారం సైతం కొనసాగనుంది. 19వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC), జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)ను సందర్శించనున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ కమిషన్ తో జరిగిన భేటీలో యూపీఎస్సీ మెంబర్స్ రాజ్ శుక్ల, శీల్ వర్ధన్ సింగ్, దినేశ్ దాస్, బిద్యుత్ బెహరీ స్వెయిన్, సుమన్ శర్మ, టీజీపీఎస్సీ సభ్యులు పాల్గొన్నారు.