TG Govt.: అన్నదాతలకు సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్.. సంక్రాంతికి రెండు కొత్త పథకాలు అమలు

రైతులకు ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వనున్నది.

Update: 2025-01-01 02:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వనున్నది. రైతుభరోసాతో పాటు రైతు కూలీలకు ఆర్థికసాయం పథకాలను సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. అందుకోసం కావాల్సిన ఆర్థిక వనరులను ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చుకున్నట్టు తెలిసింది. ఈ రెండు పథకాల అమలు కోసం దాదాపు రూ.10వేల కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనా వేశారు. త్వరలో జరిగే కేబినెట్ భేటీలో ఈ రెండు స్కీమ్స్‌కు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయనున్నది.

రైతుభరోసాతో ఎకరాకు రూ.15 వేలు

గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో ప్రతి ఎకరాకూ ఏడాదికి రూ.10 వేలు (రెండు విడతలుగా) ఆర్థిక సాయం అందించింది. కానీ కాంగ్రెస్ రైతుభరోసా పేరుతో ఆ సాయాన్ని రూ.15 వేలకు (రెండు విడతలుగా) పెంచింది. ఇందుకు దాదాపుగా రూ.7,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు లెక్కలు తీసినట్టు సమాచారం.

రైతు కూలీలకు రూ.12 వేలు

భూమి లేని రైతుకూలీలకు ప్రతి ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించేందుకు సైతం ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం దాదాపుగా రూ.2,400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కూలీలు సుమారు 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరికి మొదటి విడతగా రూ.6 వేల చొప్పున అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

కేబినెట్‌లో విధివిధానాలు ఖరారు

రైతుభరోసా, రైతుకూలీలకు ఆర్థికసాయం పథకాలకు సంబంధించిన విధివిధానాలపై ఈ నెల 4న జరిగే కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. సాగు భూములకు మాత్రమే పంట సాయం అందించాలని డిమాండ్ రావడంతో కేబినెట్ సబ్ కమిటీ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఎన్ని ఎకరాల విస్తీర్ణం వరకు స్కీమ్‌ను అమలు చేయాలనే అంశంపై సబ్ కమిటీ ఇంకా డెసిషన్ తీసుకోలేదు. దీంతో సీలింగ్ విధించాలా? వద్దా? అనే అంశం మంత్రివర్గ సమావేశంలో కొలిక్కి రానున్నది.

జీతాలు, కిస్తీల కోసం రూ.10 వేల కోట్లు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతినెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయిస్‌కు పెన్షన్లు అందిస్తున్నది. ఈ నెల సైతం ఇందుకోసం దాదాపు రూ.5,500 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు టాక్. అందులో ఐదారు వేల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులకు కిస్తీల చెల్లింపులకు సైతం ఈ నెలకు సంబంధించి రూ.4,500 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారని సమాచారం. ఆ నిధులను సైతం సమకూర్చుకునే పనిలో సర్కారు నిమగ్నమైంది.

Tags:    

Similar News