రాఖీ పండుగకు టీజీ ఆర్టీసీ కీలక నిర్ణయం
రాష్టంలోని మహిళామణులకు టీజీ ఆర్టీసీ ఒక తీపి కబురు అందించింది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్టంలోని మహిళామణులకు టీజీ ఆర్టీసీ ఒక తీపి కబురు అందించింది. రాఖీ పండుగను పురస్కరించుకొని తమ తోబుట్టువులకు రాఖి పంపేలా అవకాశం కల్పించనుంది ఏడాదంతా ఎక్కడున్నా ఆ ఒక్క రోజైనా కచ్చితంగా అన్నాచెల్లెల్లు, అక్కతమ్ముళ్లు కచ్చితంగా కలుసుకొని రాఖీతో తమ బంధాన్ని చాటుకుంటారు. అయితే దూరంగా ఉన్న వారికి రాఖీ ద్వారా తమ బంధాన్ని పంచుకునేలా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 24 గంటల్లో రాఖీలు డెలివరీ అయ్యేలా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే రాఖీ పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అంతా సిద్ధంగా ఉన్నా రాఖీల రవాణాకు సంబంధించి ఇంకా ధరను ఖరారు చేయలేదు. ఉన్నతాధికారుల అనుమతి కోసం చూస్తున్నారు. అయితే ఇందుకోసం ఎంత ఛార్జీలు వసూలు చేస్తారన్న దానిపై వచ్చే నేడు స్పష్టత రానుంది.
దూర ప్రాంతాల్లో ఉన్న తమ తోబుట్టువులకు రాఖీలను సులభంగా పంపించేందుకు ఆర్టీసీ కార్గో ద్వారా వీలు కల్పించనున్నారు. రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామగ్రిని కూడా పంపే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా పొరుగు రాష్టాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు కూడా రాఖీలను పంపించుకునే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని బస్టాండ్స్‌లోని కార్గో సెంటర్స్‌లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా కార్గో సెంటర్స్‌లో ప్యాకింగ్‌ను ఇచ్చిన 24 గంటల్లోనే డెలివరీ చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టారని అధికారులు పేర్కొన్నారు.