TG Govt.: దేవాదాయ శాఖ వినూత్న ఆలోచన.. ఆలయ భూముల్లో ‘ఆయిల్‌పాం సాగు’!

ఆలయ భూముల్లో ఆయిల్‌పాం సాగుచేస్తే భూములను పరిరక్షించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Update: 2024-12-28 01:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆలయ భూముల్లో ఆయిల్‌పాం సాగుచేస్తే భూములను పరిరక్షించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌కు లీజుకు ఇస్తే ల్యాండ్స్ సంరక్షణతో పాటు సర్కారుకు ఆదాయం వస్తుందని, శాఖపైన ఎలాంటి ఆరోపణలు రావని అనుకుంటోంది. ఇప్పటికే వ్యవసాయశాఖ ఆయిల్‌పాం సాగుపై ప్రత్యేక దృష్టి సారించడం, మార్చి వరకు లక్ష ఎకరాల సాగును లక్ష్యంగా ఎంచుకోవడంతో ఎండోమెంట్ భూములు ఇస్తామని ఆ శాఖకు ప్రతిపాదనలు పంపినట్టు విశ్వసనీయ సమాచారం. అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చిన వెంటనే ప్రాసెస్ స్పీడ్ పెంచుతారని తెలిసింది.

దేవాదాయ భూముల రక్షణకు ప్రణాళికలు

దేవాదాయశాఖ భూముల పరిరక్షణ కోసం సర్కారు పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. ల్యాండ్స్ ఆక్రమణకు గురికాకుండా చర్యలు ఒక వైపు, ఇప్పటికే గురైనవాటిని తిరిగి వెనక్కి తీసుకునేందుకు ముమ్మర కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎండోమెంట్ పరిధిలో మొత్తం 91,827 ఎకరాల భూమి ఉంది. అందులో ఇప్పటికే 25 వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు తీసుకుంటున్న చర్యలతో 9,135.33 ఎకరాలను కబ్జాదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్న మరో 6 వేల ఎకరాలపై ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దేవాదాయశాఖ వద్ద ప్రస్తుతం 75,765.01 ఎకరాల భూమి ఉంది. ఇందులో 28,264.24 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చారు. ఇందులో కొన్ని షాపులు నిర్మించగా, వాటిని కూడా లీజుకు ఇచ్చారు. మరో వైపు అర్చక పెన్షన్ల కింద 18,666 ఎకరాల భూమిని కేటాయించారు. భూమి లీజు, షాపులు, అర్చక పెన్షన్ల కింద మొత్తం 47,130.24 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇదిగాక ఇంకా 28,634.86 ఎకరాల భూమి ఉంది. ఆ ల్యాండ్‌కు సర్కారు రక్షణ చర్చలు చేపట్టింది.

మార్క్‌ఫెడ్‌కు ఎండోమెంట్ ల్యాండ్స్ అప్పగింత!

ప్రభుత్వ రంగ సంస్థలకు దేవాదాయశాఖ భూమిని అప్పగిస్తేనే రక్షణగా ఉంటుందని శాఖ భావిస్తోంది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ల్యాండ్స్‌ను అప్పగిస్తే విమర్శలు వస్తాయని భావించిన సర్కారు.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌కు అప్పగిస్తేనే ఉత్తమం అని భావిస్తున్నట్టు తెలిసింది. పామాయిల్ ఎక్కువ ఏండ్ల పంట కావడంతో ఎన్ని ఏండ్లకు లీజుకు ఇవ్వాలి, లీజు ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయాల అభివృద్ధికా? ఉద్యోగుల వేతనాలకా? ఎలా చేస్తే బాగుంటుందనే దానిపైనా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వంపై రిమార్క్ రాకుండా పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఆలయ భూముల సంరక్షణకు త్వరలో లీగల్ టీం

ఆలయాల అభివృద్ధి, భూముల సంరక్షణకు చేపట్టాల్సిన అంశాలపై నిరంతరం ఆ శాఖ మంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆఫీసర్లకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ విధివిధానాల రూపకల్పనతో పాటు త్వరలో లీగల్ టీంను యాక్టివ్ చేయనున్నట్టు సమాచారం. ఆక్రమణకు గురైన భూములను వెనక్కి తీసుకొచ్చేందుకు కబ్జాదారులకు నోటీసులు ఇవ్వాలని, కేసులు వేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. అంతేగాకుండా ఆలయ భూములు అని తెలుపుతూ బోర్డులు, భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని, నిత్యం మానిటరింగ్ చేయడంతో పాటు వాటి వివరణలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని మంత్రి సూచించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపైనా ప్రత్యేక నిఘా పెంచినట్టు విశ్వసనీయ సమాచారం.

కీలకంగా మారిన ‘మార్క్‌ఫెడ్’ డెసిషన్

వ్యవసాయశాఖ రైతులను ఆయిల్‌పాం సాగుకు ప్రోత్సహిస్తోంది. రాయితీలను సైతం ఇస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటివరకు 2.31 లక్షల ఎకరాల్లో రైతులు ఆయి‌ల్‌పాం సాగు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 12వ తేదీవరకు 28 వేల ఎకరాల్లో సాగు పూర్తి చేశారు. మార్చి నాటికి లక్ష ఎకరాల సాగును ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరో 72 ఎకరాల్లో సాగు చేస్తే టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఒక వేళ రైతులు ఆశించిన మేరకు రాకపోతే మార్క్‌ఫెడ్ సంస్థ భూములు కావాలని దేవాదాయశాఖను కోరితే.. భూమిలీజు, షాపులు, అర్చక పెన్షన్ల కింద కేటాయించిన 47,130.24 ఎకరాల భూమిలో కొన్ని ఎకరాలను ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్న 28,634.86 ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే, మార్క్‌ఫెడ్ సంస్థ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని, తాము అయితే ఆ సంస్థకు ల్యాండ్ అప్పగించేందుకు రెడీగా ఉన్నామని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News