TG Govt.: ‘బీసీ బిల్లు’.. పబ్లిసిటీ నిల్..! కాంగ్రెస్ నో సెలబ్రేషన్స్
విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన బీసీ బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించిన బీసీ బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. తీవ్రమైన విమర్శలు వచ్చినా.. ప్రణాళికా బద్ధంగా కులగణనను చేపట్టిన ప్రభుత్వం.. విజయవంతంగా చట్టబద్ధత కల్పించి బీసీల మన్ననలు పొందింది. అయితే వీటిని ఓన్ చేసుకొని రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవడంలో, క్రెడిట్ దక్కించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే చర్చ జరుగుతున్నది. అందుకే బీసీ బిల్లులకు సంబంధించి గ్రామ, మండల స్థాయిలో ఎక్కడ కూడా సంబురాలు చేసుకోలేదని, పార్టీ కేడర్ కనీసం రెస్పాండ్ కాలేదని పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
అడ్డంకులను అధిగమించి..
కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. ముందుగా రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకువచ్చి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు బీసీ కమిషన్ తో కాకుండా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. ఒక సారి సర్వే పూర్తయినా.. ఇంకా కొందరు పాల్గొనలేదని గుర్తించి.. వారి వివరాలు నమోదు చేసుకునేలా మరో రెండువారాల సమయం ఇచ్చింది. విపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా.. అన్ని అడ్డంకులను అధిగమించి బీసీ గణనను పూర్తి చేసింది. విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి రెండు వేర్వేరు బిల్లులను రూపొందించి అసెంబ్లీలో ఆమోదింపజేసింది. సాంకేతికంగా, రాజకీయంగా విమర్శలకు తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించి.. ప్రభుత్వం బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలిపింది.
ప్రచారంలో పార్టీ విఫలం
అనేక అడ్డంకులను అధిగమించి కులగణనను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసి.. ఆ తర్వాత అసెంబ్లీలో బీసీ బిల్లులను ఆమోదింపజేసినా.. వాటిని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేకపోయిందనే చర్చ జరుగుతున్నది. మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు స్పందించలేదని.. వారిని ఆ దిశగా ఎవరూ కార్యోన్ముఖులను చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. కనీసం సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారని పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలిసింది.
బీసీ సంఘాలతో సభ.. రాహుల్ హాజరు!
కులగణన, బీసీ బిల్లులను ప్రజల్లోకి మరింత తీసుకుపోయేందుకు బీసీ సంఘాలతో బహిరంగ సభ పెట్టించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యేలా చేసి, బీసీ సంఘాల ద్వారా అభినందనలు తెలిపే కార్యక్రమం చేపట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ సూచనల మేరకే కులగణన చేపట్టగా.. ఆయనను రాష్ట్రానికి తీసుకువచ్చి సభ నిర్వహించడం ద్వారా క్రెడిట్ కొట్టెయవచ్చని పార్టీ ప్లాన్. అంతేకాకుండా దేశ వ్యాప్తంగానూ బీసీల కోసం పోరాడవచ్చని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై సమాలోచనలు ప్రాథమిక దశలో ఉన్నాయని, త్వరలో రాహుల్ గాంధీని కలవనున్న సందర్భంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.