TG Assembly: నో సస్పెన్షన్స్.. నో యాక్షన్స్! ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ సెషన్స్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ నడిపించే తీరు పూర్తిగా మారిందనే టాక్ ఉన్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ నడిపించే తీరు పూర్తిగా మారిందనే టాక్ ఉన్నది. శీతకాల అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయని చర్చ జరుగుతున్నది. విపక్షాల సంఖ్యాబలం కంటే ఎక్కువ సమయమే స్పీకర్ ఇచ్చినట్టు ప్రశంసలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరుపులు, కేకలతో సభను అడ్డుకున్నా, రూల్స్ అతిక్రమించినా సభాపతి వారించారే తప్పా ఎలాంటి యాక్ష న్లు తీసుకోలేదు. పోడియం వద్దకు వచ్చి రచ్చ రచ్చ చేసినా, చివరికి తనపై కాగితాలు చించి విసిరేసినా స్పీకర్ సభను నడిపించేందుకు చొరవ చూపారు.
సంయమనంతోనే..
శీతకాల సమావేశాలు ప్రారంభం నుంచి సభలో ప్రతి రోజు బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనలు, నిరసనలు, నినాదాలు కొనసాగాయి. కొన్ని సార్లు అరుపులు, కేకలు వేశారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపైనే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ, సభను అడ్డుకోవడం కామన్ గా మారిందనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా శుక్రవారం రోజు సభలో చోటు చేసుకున్న పరిణామాలు పెద్ద వివా దంగా మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ అవేమీ పట్టించుకోకుండా స్పీకర్ సభాను యథావిధిగా కొనసాగించారు. ఆ రోజు సభ ప్రారంభమైన వెంటనే ఫార్ములా ఈ– రేసు అం శంపై చర్చ జరపాలని ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. పోడియం వద్దకు వెళ్లారు. ఏకంగా మాజీ మంత్రి హరీశ్ రావు తోటి సభ్యులను నెట్టేసుకుని పోడియం వైపునకు దూసుకెళ్లారు. ఆయన వెంటే మిగతా సభ్యులు వెళ్లారు. అక్కడ ఉన్న కాగితాలను చించి స్పీకర్ పై విసిరారు. వీరిని మార్షల్స్ అడ్డుకునే ప్రయత్నం చేయగా పెద్ద తోపులాట జరిగింది. నిజానికి ఈ ఇన్సిడెంట్ తో బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ వేటు వేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోకుండా సభాను తిరిగి ప్రారంభించారు. ఈ సభలో ఇంతవరకు ఒక్క సభ్యుడిని సస్పెండ్ చేయలేదు. విపక్ష సభ్యులు వాకౌట్ చేసి బయటికి వెళ్లారు.
రన్నింగ్ కామెంట్రీ
బీఆర్ఎస్ హయంలో సీఎం హోదాలో కేసీఆర్ మాట్లాడితే ఎవరైనా రన్నింగ్ కామెంట్రీ చేసేం దుకు భయపడేవారు. ఎందుకంటే రన్నింగ్ కామెంట్రీ చేస్తోన్న సభ్యులపై వేటు వేస్తారనే భయంతో తమకు ఇష్టం లేకున్నా ఆయన స్పీచ్ ను వినేవారు. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతోన్నంత సేపు రన్నింగ్ కామెంట్రీ కొనసాగుతున్నది. బీఆర్ఎస్ సభ్యులు ఎంత రచ్చ చేసే ప్రయత్నం చేసినా రేవంత్ తను చెప్పదల్చుకున్న విషయాన్ని ప్రజలకు వివరించేందుకు ప్రయత్నించారు.
గతంలో సభ్యత్వాలు రద్దు
తెలంగాణ వచ్చాక తొలి అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డిని గవర్నర్ స్పీచ్ అడ్డుకున్నారనే కారణంతో సభా కాలం మొత్తం సమావేశాలకు రాకుండా నిర్ణయం తీసుకున్నారు. అదే సభలో కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ గవర్నర్ స్పీచ్ సమయంలో కాగితాలు చింపారనే కారణంతో ఇద్దరి సభ్యత్వాలను సభాపతి రద్దు చేశారు. విపక్ష సభ్యలను సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం అప్పట్లో సర్వసాధారణంగా జరిగేవి. ఎవరైనా తమకు కేటాయించిన సమయం కంటే అర నిమిషం ఎక్కువ మాట్లాడే చాన్స్ వచ్చేది కాదని విమర్శలు ఉండేవి. సభలోకి ప్ల కార్డులను తీసుకురాకుండా అడ్డుకునేవారు. స్లోగన్స్ ఇస్తే వెంటనే బయటకి పంపేవారు. నిత్యం మార్షల్స్ సభ్యులను బయటికి ఎత్తుకొచ్చేవారు.
పార్లమెంటరీ పదాలతో ఎటాకింగ్
శీతకాల సమావేశాల చివరి రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ హాయంలో జరిగినఅప్పులు, వాటిని బయటికి రాకుండా తీసుకున్న జాగ్రత్తలను ఆధారాలతో వివరించారు. లగచర్ల ఇన్సిడెంట్ వెనుక ఉన్న రాజకీయ కారణాలు బహిర్గతం చేశారు. మారుమూల ప్రాంతమైన కొడంగల్ ను అభివృద్ది చేసేందుకు తాము చేస్తోన్న ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని ఆరోపించారు. దాదాపు గంటన్నర పాటు ఆయన అన్ని పలు అంశాలను ప్రస్తావించారు. అయితే గతంలో కంటే భిన్నంగా పరుష పదాలు లేకుండా, పార్లమెంటరీ పదాలుగా పిలిచే ‘రాక్షసులు.. రాళ్లతో కొట్టి చంపాలే.. ఆర్థిక ఉగ్రవాదులు..సద్దులు మోసేవాళ్లు..’అని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పై ఎటాక్ చేశారు. గతంలో ఆయన బీఆర్ఎస్ సభ్యులు ఏదైనా మాట్లాడితే వెంటనే రియాక్ట్ అయ్యేవారు. కానీ ఈసభలో ఆయన అందరి మాటలను కూల్ గా వింటూ, తన స్పీచ్ లోనే సదరు సభ్యులపై విమర్శలు చేశారు.