దేశవ్యాప్తంగా ప్రధాన సిటీల్లో విధ్వంసానికి కుట్ర.. ‘ఉగ్ర’ కేసులో సంచలన విషయాలు!

ఉగ్రవాదుల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రకరకాల ప్రలోభాలు చూపించి పలువురిని ఇస్లాం మతంలోకి మార్చిన హర్కత్–ఉత్–తహ్రీర్​సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పట్టణాల్లో భారీ విధ్వంసాలకు కుట్ర చేసినట్టుగా సమాచారం.

Update: 2023-05-10 23:30 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఉగ్రవాదుల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రకరకాల ప్రలోభాలు చూపించి పలువురిని ఇస్లాం మతంలోకి మార్చిన హర్కత్–ఉత్–తహ్రీర్​సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పట్టణాల్లో భారీ విధ్వంసాలకు కుట్ర చేసినట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే మతం మార్చుకున్న ముగ్గురితోపాటు మొత్తం ఆరుగురిని కొన్ని నెలల క్రితమే హైదరాబాద్‌కు పంపించినట్టుగా పోలీసువర్గాలు చెబుతున్నాయి. వీరికి వికారాబాద్​అటవీ ప్రాంతంలో కాల్పులు జరిపే అంశంలో శిక్షణ ఇచ్చినట్టుగా కూడా సమాచారం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న యాసిన్‌ను నిశితంగా విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగు చూస్తాయని చెబుతున్నాయి.

కేంద్ర నిఘా వర్గాలు అందించిన సమాచారంతో మధ్యప్రదేశ్​యాంటీ టెర్రరిస్ట్​స్క్వాడ్​అధికారులు తెలంగాణకు చెందిన కౌంటర్​ఇంజెలిజెన్స్​సిబ్బందితో కలిసి జాయింట్​ఆపరేషన్​జరిపి మంగళవారం హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఓ కాలేజీలో హెచ్వోడీగా పని చేస్తున్న మహ్మద్​సలీం, ఎమ్మెన్సీ కంపెనీలో క్లౌడ్​ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న అబ్దుల్​రహమాన్, పాతబస్తీలో డెంటిస్టుగా చలామణి అవుతున్న షేక్​జునైద్, రోజువారీ కూలీలు మహ్మద్​అబ్బాస్, హమీద్‌లను అరెస్టు చేశారు. కాగా, మహ్మద్​సల్మాన్​పోలీసులకు చిక్కకుండా పరారయ్యాడు. అయితే, అతని కోసం తీవ్రంగా గాలింపు చేపట్టిన యాంటీ టెర్రరిస్ట్​స్క్వాడ్​అధికారులు బుధవారం మహ్మద్​సల్మాన్‌ను కూడా అరెస్టు చేసి అందరినీ భోపాల్​తరలించారు. వీరిని జరిపిన ప్రాథమిక విచారణలో హర్కత్–ఉత్–తహ్రీర్ సంస్థలోని ఆర్మ్‌డ్ వింగ్​యువకులకు సాయుధ శిక్షణతోపాటు బ్యాక్టీరియాలాజికల్, బయోలాజికల్​వార్‌లో శిక్షణ ఇస్తున్నట్టుగా వెల్లడైంది. దాదాపు యాభై దేశాల్లో విస్తరించి ఉన్న హర్కత్–ఉత్​–తహ్రీర్​సంస్థ దేశం మొత్తం మీద ఉన్న ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున అలజడులు సృష్టించటానికి భోపాల్​కేంద్రంగా కుట్రలు చేసినట్టుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ సంస్థకు చెందిన యాసిన్​పలువురిని ఇస్లాం మతంలోకి మార్చి వారిని వేర్వేరు రాష్ట్రాలకు పంపించినట్టుగా తెలిపారు.

వికారాబాద్​ అడవుల్లో...

ఇలా భోపాల్​నుంచి కొన్ని నెలల క్రితం హైదరాబాద్ వచ్చి వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డ మహ్మద్​సలీం, అబ్దుల్​రహమాన్, షేక్​జునైద్, మహ్మద్​అబ్బాస్, హమీద్, మహ్మద్​సుల్తాన్‌లు ఇక్కడ కూడా కొంతమందిని ఇస్లాంలోకి మార్చినట్టుగా పోలీసువర్గాల ద్వారా తెలిసింది. అంతే కాకుండా వికారాబాద్​అడవుల్లో ఎయిర్​పిస్టళ్లతో కాల్పులు జరపటంలో తర్ఫీదు కూడా తీసుకున్నట్టుగా ఆ వర్గాల సమాచారం.

ఆరుగురిలో ముగ్గురు మతం మార్చుకున్నవారే...

ఇక, హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఆరుగురిలో ముగ్గురు మతం మార్చుకున్నవారేనని పోలీసువర్గాలు తెలియచేశాయి. ఈ ముగ్గురిని యాసిన్​ప్రలోభాలు చూపించి మతమార్పిడి జరిపించినట్టుగా విచారణలో తేలిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సౌరభ్​రాజ్​విద్య అనే వ్యక్తిని ఇస్లాంలోకి మార్చి మహ్మద్​సలీంగా అతని పేరు మార్చినట్టు చెప్పాయి. ఇక, దేవీప్రసాద్​పాండాను కూడా విధంగా ఇస్లాంలోకి మార్చి అబ్దుల్​రహమాన్, బస్కా వేణుకుమార్‌ను మహ్మద్​అబ్బాస్‌గా మార్చినట్టు వివరించాయి. యాసిన్​మాడ్యూల్లో దాదాపు ఇరవై మంది ఉన్నట్టుగా తమకు సమాచారం ఉందని తెలిపాయి. తన మాడ్యూల్‌లో ఉన్నవారితో ఎవరికి వారే ఒంటరిగా దాడులు జరిపించాలన్నది యాసిన్​కుట్ర అని పేర్కొన్నాయి. ఇప్పటికే యాసిన్​మాడ్యూల్‌లో ఉన్న పలువురు ఎయిర్​పిస్టళ్లు, ఎయిర్​గన్లు, గొడ్డళ్లు, కత్తులు, డాగర్లు కొని పెట్టుకున్నట్టుగా నిర్ధారణ అయినట్టు వివరించాయి.

ఐసిస్ ​కంటే ప్రమాదం...

హర్కత్–ఉత్–తహ్రీర్​సంస్థ ఐసిస్​కన్నా ప్రమాదకరమైందని పోలీసు వర్గాలు చెప్పాయి. ఇప్పటికే ఈ సంస్థ ఉనికి యాభై దేశాల్లో ఉన్నట్టు తెలిపాయి. పదిహేను దేశాల్లో ఈ సంస్థపై నిషేధం అమలవుతున్నట్టు వివరించాయి. భారత్–పాక్​సరిహద్దుల్లోని వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ యువకులకు ఆయుధాలను ఎలా వాడాలన్న దాంతోపాటు బ్యాక్టీరియాలాజికల్, బయోలాజికల్​వార్​లోనూ ట్రైనింగ్​ఇస్తున్నట్టుగా వివరించాయి.

ఏ పాపం తెలియదు...

కాగా, మధ్యప్రదేశ్​యాంటీ టెర్రరిస్ట్​స్క్వాడ్​పోలీసులు అరెస్టు చేసిన మహ్మద్​సలీం భార్య రెహాలా మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తకు ఏ పాపం తెలియదని చెప్పింది. పిల్లలు ఆడుకునే పిస్టళ్లను పట్టుకుని ఉగ్రవాద కార్యకలాపాల కోసం కొన్నారని చెబుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించింది. హిజమా కోర్సును అభ్యసించేందుకు హైదరాబాద్​వచ్చినట్టు తెలిపింది. తన భర్త ఓ కాలేజీలో హెచ్వోడీగా పని చేస్తున్నారని, ఆయనకు ఉగ్రవాద కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఇక, మరో నిందితుడు హమీద్​భార్య హమీదా మాట్లాడుతూ.. తన భర్తకు ఎలాంటి టెర్రరిస్టు కార్యకలాపాలతో సంబంధం లేదని తెలిపింది. రోజు కూలీ చేసుకుని తన భర్త కుటుంబాన్ని పోషించేవాడని చెప్పింది.

Tags:    

Similar News