రెగ్యులరైజేషన్‌కు ఫేక్ సర్టిఫికెట్ల టెన్షన్
కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలో భాగంగా రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ఆయా శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలో భాగంగా 3897 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కానీ ఆ ప్రక్రియకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. క్రమబద్ధీకరణ ప్రక్రియకు నకిలీ సర్టిఫికెట్ల మకిలి పట్టుకుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే వెరిఫికేషన్ ప్రక్రియ కంపల్సరీ ఉంటుంది. కానీ ఇప్పుడు చేపడుతున్న ప్రక్రియకు ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ప్రాసెస్ చేపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగి సంబంధింత కళాశాల ప్రిన్సిపాల్ ధృవీకరణ పత్రం ఆధారంగానే రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు సమాచారం. దీనిపై నిరుద్యోగులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో పలువురు ఉద్యోగాలు పొందారని, అలాంటి వారిని గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల బెడద ఎప్పటినుంచో ఉంది. పలు వర్సిటీల్లోనూ నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో కొనసాగి పట్టుబడిన సందర్భాలూ ఉన్నాయి. దీనిపై ఉన్నత విద్యామండలి, ప్రభుత్వం సైతం దృష్టిసారించింది. కట్టడికి ప్రయత్నాలు చేస్తోంది. కానీ నకిలీ సర్టిఫికెట్లు పట్టుబడని వారి సంగతేంటనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రధాన సమస్య. నకిలీ.. మకిలీకి ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుందనేది అంతుచిక్కడం లేదు. ఆధునిక యుగం కావడంతో ఆయా రాష్ట్రాల వర్సిటీల సర్టిఫికెట్లను కేటుగాళ్లు సులువుగా సృష్టిస్తున్నారు.
ఇలా నకిలీ ధృవపత్రాలు సమర్పించిన వారు చాలా మంది ఉన్నారని నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు రెగ్యులరైజేషన్ కాబోయే వారిలో బోగస్ సర్టిఫికెట్లు, అవకతవకలకు పాల్పడిన వారు కనీసం 5 నుంచి 10 శాతం మంది ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పారదర్శకంగానే ప్రక్రియ చేపడుతామని చెప్పేందుకు ప్రభుత్వం, అధికారులు అర్హుల జాబితాను ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అర్హులా? కాదా? అనే జాబితాను ప్రకటించే దమ్ము అసలు ప్రభుత్వం, అధికారులకుందా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 3897 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం ఈ వివాదానికి దారితీసింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 2532(సాంక్షన్డ్ పోస్టులు) మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను, జనరల్ స్ట్రీమ్ వర్కింగ్ లో విధులు నిర్వర్తించే 376 మంది, వొకేషనల్ విభాగంలో పనిచేసే 184 మంది జూనియర్ లెక్చరర్లు, 251 మంది కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
అయితే జూనియర్ కాలేజీల్లో పనిచేసే వారిలో పలువురికి అర్హత లేకున్నా విధుల్లో కొనసాగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లోకి వచ్చారని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల వర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరారని చెబుతున్నారు. కాగా ఇంకొందరు 50 శాతం ఉత్తీర్ణత లేకుండానే చేరారని, ఆపై డిస్టేన్స్ లో చేరో లేక ఇతర వర్సిటీల బోగస్ ఆ సర్టిఫికెట్లను అందించో కొనసాగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇలా నకిలీ సర్టిఫికెట్లతో పట్టుబడిని సంఘంటనలు కోకొల్లలుగా ఉన్నాయి. మద్రాస్ వర్సిటీ పేరిట విధుల్లోకి చేరి పట్టుబడిన విషయం తెలిసిందే.
గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం నియమించిన సమయంలో వారికి వేతనం చాలా తక్కువగా ఉండేది. ఆ సమయంలో తక్కువ జీతం పేరిట పలువురు విధులకు దూరంగా ఉండి మరో చోట ఉద్యోగం చేసిన సందర్భాలున్నాయి. ఆయా కాలేజీల్లో ప్రిన్సిపాళ్ల అండతో వారిని మేనేజ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగారు. కాగా తెలంగాణ ప్రభుత్వం వారి వేతనాన్ని రూ.18 వేలకు చేయడంతో తిరిగి విధుల్లోకి చేరారు. గతంలో మెదక్ జిల్లాలోని ఒక కళాశాలలో తక్కువ వేతనం పేరిట ఉద్యోగం వదిలి వెళ్లిపోయి జీతం పెరిగిన వెంటనే విధుల్లోకి చేరినవారూ ఉన్నారు.
ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే సదరు వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలపై స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఎంక్వైరీ చేశాకే ఎలాంటి రిమార్క్ లేదనుకుంటేనే నియామకం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియలో ఎలాంటి పారదర్శకత, ఎంక్వైరీ ప్రక్రియ చేపట్టకుండా క్రమబద్ధీకరించడంపై నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ ఇచ్చిన ధృవీకరణ ఆధారంగానే రెగ్యులరైజ్ చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఇలా చేస్తే ఎన్నో అవకతవకలు జరిగే అవకాశముందని ఆరోపిస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగుతున్న వారిలో చాలామంది ఆయా కాలేజీలకు చెందిన ప్రిన్సిపాళ్ల కుటుంబీకులు, బంధువులు ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రాజీకీయ, ఆయా సంఘాల నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఇష్టారాజ్యంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియను చేపట్టం ఏమాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అందుకే తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.