ఎమ్మెల్యేల్లో ‘డబుల్’ గుబుల్.. ఆధార్ లింక్ చేయడమే పరిష్కారమా?

‘వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పట్టణాలకు, నగరాలకు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. మౌలిక వసతులు, ఇతర పనులు చేయించుకుంటున్నారు.

Update: 2023-05-12 02:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పట్టణాలకు, నగరాలకు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. మౌలిక వసతులు, ఇతర పనులు చేయించుకుంటున్నారు. ఎన్నికలప్పుడు మాత్రం స్థిరాస్తులు సొంత గ్రామాల్లో ఉండటంతో అక్కడికి వెళ్లి ఓటు వేస్తున్నారు.. దీంతో ఐదేండ్లు మేం వారి కోసం పని చేస్తే తీరా ఓట్ల సమయంలో సొంతూళ్లకు వెళ్లడంతో నష్టపోతున్నాం’ అని గ్రేటర్ కు చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారు. డబుల్ ఓట్లు ఉన్నాయని ఆధార్ లింక్ ను పకడ్బందీగా అమలు చేస్తేనే సమస్య పరిష్కారమవుతుందంటున్నారు. అయితే ఎమ్మెల్యేలకు డబుల్ ఓటున్న ఓటర్లతో ఇబ్బందులు తప్పడం లేదు.

మునుగోడు డేటాతో షాక్..

ఇతర నియోజకవర్గాల నుంచి ఎంతమంది నగరాలకు వలస వచ్చారనేది మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రభుత్వం డేటా తీసింది. దీంతో ఒక్క మునుగోడు నియోజకవర్గం నుంచే 20వేల మంది ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని తేలింది. దీంతో గ్రేటర్ లోని ఎమ్మెల్యేలు షాక్ గురయ్యారు. అయితే వారందరి ఓట్ల కోసం అధికార పార్టీ నేతలు ఆత్మీయ సమ్మేళనాలతో పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా సొంత నియోజకవర్గాలకు వెళ్తే తమకు ఓటింగ్ తగ్గడంతోపాటు గెలుపోటములపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వలస ఓటర్లతో పట్టణ ఎమ్మెల్యేలకు గుబులు పట్టుకుంది.

పట్టణంలో నివాసం.. గ్రామాల్లో ఓటు...

పట్టణాల్లో నివాసం, గ్రామాల్లో ఓటు ఉన్నవారితో ప్రజాప్రతినిధులకు కష్టాలు తప్పడం లేదు. విద్య, ఉపాధి కోసం ప్రజలు నగరాలకు, పట్టణాలకు వెళ్లి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నవారు, గ్రామాల్లో స్థిరాస్తులు ఉండటంతో ఓటును అక్కడే వినియోగించుకుంటున్నారు. దీంతో సొంత గ్రామాల్లోనే ఓటు ఉండేలా చూసుకుంటున్నారు. అలాగే నగరాల్లో సైతం ఓటును నమోదు చేసుకుంటున్నారు. ఇలా నగరాల్లోని వారికి డబుల్ ఓట్లు ఉంటున్నాయి. అందరూ ఆధార్ లింక్ చేయించుకోకపోవడంతో కొన్ని డబుల్ ఓట్లు అలాగే ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారు 20వేల మందికి పైగా ఓటర్లు ఉంటున్నారు. వీరంతా ఉండే కాలనీల్లో ఏ సమస్య వచ్చినా స్థానిక ఎమ్మెల్యేతోనే పనులు చేయించుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఒకే రోజు జరుగుతుండటంతో నగరాలకు వలసపోయిన ఓటర్లు తిరిగి తమ నియోజకవర్గానికి వెళ్లి సొంత ఊరిలోనే ఓటు వేస్తున్నారు. దీంతో గ్రేటర్, నగరాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు హ్యాండ్ ఇచ్చినట్లవుతుంది. ఐదేళ్లపాటు సేవలు చేయించుకుని పోలింగ్ రోజు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోకపోవడంపై పలువురు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ‘పనులేమో మేము చేయాలి... ఓటు మరొకరికి వేస్తారా?’ అని ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం డబుల్ ఓట్లేనని.. కేంద్రం పకడ్బందీగా ఓటును ఆధార్ కు అనుసంధానం చేస్తేనే సమస్య పరిష్కామవుతుందంటున్నారు.

ఇవి కూడా చదవండి:   ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వివాదం.. బీఆర్ఎస్‌కు హిందూ సంఘాల హెచ్చరిక!

Tags:    

Similar News

టైగర్స్ @ 42..