సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. కారు దిగి కాలినడకన వెళ్లిన రేవంత్ రెడ్డి
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఆరోపణల వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఈ క్రమంలో సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఆరోపణల వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఈ క్రమంలో సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్ శ్రేణలు నిరసనకు దిగాయి. బారికేడ్లు తోసుకుంటూ సిట్ కార్యాలయం వద్దకు కార్యకర్తలు దూసుకువచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి వెంట వస్తున్న కాన్వాయ్ ను లిబర్టీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో రేవంత్ తో వచ్చిన వాహనాలకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కారు దిగి సిట్ కార్యాలయం వైపు నడుచుకుంటూ వెళ్లారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాగా పేపర్ లీకేజీలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందని రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. మంత్రి పేషీ నుంచే ఈ తతంగం జరిగిందని రేవంత్ ధ్వజమెత్తారు. దీంతో ఈ ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సిట్ విచారణను రేవంత్ ఎదుర్కోబోతున్నారు.
పలువురు నేతల హౌస్ అరెస్ట్:
రేవంత్ రెడ్డి సిట్ విచారణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్, మల్లు రవి, వీహెచ్, బల్మూరి వెంకట్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Read More: సిట్ విచారణకు ముందు రేవంత్ సంచలన ట్వీట్