KCR: కేసీఆర్ నిర్ణయంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్?
దిశ, డైనమిక్ బ్యోరో: తెలంగాణలో ఎన్నికలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎన్నికలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాబోయే ఎన్నికల కోసం పార్టీలు ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో కొట్టాలని చూస్తుంటే ప్రభుత్వ వైఫల్యాలు, సరికొత్త స్కీమ్‌లతో బీజేపీ, కాంగ్రెస్‌లు తమ ప్రయత్నాలు కొనసాగించేలా కసరత్తు ప్రారంభించాయి. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పెట్టిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ముంగిట్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే కారు పార్టీ ఎమ్మెల్యేల ఆందోళనకు కారణంగా ప్రచారం జరుగుతోంది.
గులాబీ బాస్ నిర్ణయంతో అయోమయం:
మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సవాల్‌గా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు బై ఎలక్షనే సెమీ ఫైనల్‌గా పరిగణిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. పొత్తుల విషయంలో కేసీఆర్ ఆలోచన వైఖరి సొంత పార్టీలో దుమారం రేపుతోంది. కమ్యూనిస్టులతో కలిసి మునుగోడు ఉప ఎన్నికను ఢీ కొనబోతున్నట్లు ప్రకటించిన కేసీఆర్.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోను పొత్తు కొనసాగిస్తారనే ప్రచారం ఆసక్తిగా మారింది. ఇందుకోసం కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లను సైతం త్యాగం చేయడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారనే టాక్ కారు పార్టీలో కుదుపులకు గురి చేస్తోందనే ప్రచారం వినవస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్ పలు సందర్భాల్లో పొత్తులతో ఎన్నికలకు వెళ్లింది. 2004లో కాంగ్రెస్, వామపక్షాలతో, 2009లో టీడీపీ వామపక్షాలతో టీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. ఈ రెండు సందర్భాల్లో టీఆర్ఎస్ మిశ్రమ ఫలితాలను చవిచూసినా రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014, 2018 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సక్సెస్ సాధించింది. మూడోసారి అధికారంలోకి రావాలంటే పొత్తులు తప్పనిసరి అని కేసీఆర్ భావిస్తున్నారని, ఇందుకోసం వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
త్యాగానికి సిద్ధమేనా?:
కలిసొచ్చే పార్టీలతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడమే కాకుండా కొన్ని సీట్లను త్యాగం చేసేందుకు సైతం వెనుకాడబోదనే ప్రచారంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా తమకు పట్టు ఉన్న ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మెదక్‌లో కొన్ని, హైదరాబాద్‌లో ఒక స్థానం చొప్పున కేటాయించాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చాయనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయ అవసరాల దృష్ట్యా ఈ ప్రతిపాదనలకు కేసీఆర్ అంగీకారం చెబితే టీఆర్ఎస్‌లో ఎవరి టికెట్‌కు ఎసరు పడనుంది అనేది గులాబీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వామపక్షాలు ప్రతిపాదించిన స్థానాలల్లో అధిక భాగం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారని ఈ నేపథ్యంలో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వారు తమ టికెట్లను త్యాగం చేయడానికి సిద్ధం అవుతారా అనేది సందేహాంగా మారింది. ప్రస్తుతానికి అధినేత కేసీఆర్ మాటకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ తీర టికెట్ల కేటాయింపు సమయానికి అదే మాటపై నిలబడతారా? లేక త్యాగం లేదు ఏమీ లేదు.. పార్టీ పార్టీనే, రాజకీయం రాజకీయమే, అంటూ అసమ్మతి రాగం వినిపిస్తారా అనేది చర్చనీయంశంగా మారింది.