ఉష్ణోగ్రతల్లో డేంజర్ మార్క్ దాటిన తెలంగాణ.. రెడ్ జోన్‌లోకి ఆ పది ప్రాంతాలు..!
రాష్టంలో రాబోయో మూడు, నాలుగు రోజుల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలో రాబోయే మూడు, నాలుగు రోజుల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా ఎండ తీవ్రతలు 40 డిగ్రీలు ఉంటేనే ఆ తీవ్రతకు తట్టుకునేది కష్టం. అలాంటిది ఇప్పుడు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం అత్యధికంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం అని స్పష్టం చేసింది.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. ఈ వేళలలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కానున్నట్లు వెల్లడించింది. దీనికితోడు వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే రాత్రివేళల్లో కనిష్ఠంగా 26 డిగ్రీలు.. గరిష్ఠంగా 28 డిగ్రీలుగా నమోదు అవుతుందని స్పష్టం చేసింది. హైదరాబాద్ సిటీలో వర్షాలు పడే సమయంలో.. పగటి ఉష్ణోగ్రత ఎంత నమోదు అవుతుందో.. ఇప్పుడు రాత్రి సమయాల్లో అంత నమోదు అవుతుంది. ఈ లెక్కన రాత్రులు కూడా ఉక్కబోత ఉంటుందని తెలిపింది.
రాష్టంలో అత్యధికంగా 10 ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జమ్మికుంట (కరీంనగర్), మంథని( పెద్దపల్లి), నిడమనూరు (నల్గొండ), మిర్యాలగూడ (యాదాద్రి భువనగిరి), వెలగటూర్( జగిత్యాల), వీణవంక (కరీంనగర్), మాడుగులపల్లి (నల్గొండ), అల్లిపూర్ (జగిత్యాల), మాతూర్ ( నల్గొండ) దీంతో ఆ 10 ప్రాంతాలు రెడ్ జోన్‌లోకి వెళ్లాయి .
మే నాటికి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని, దీని ఫలితంగా ఉత్తర, మధ్య భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటింది. రాబోయే వారంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు దాదాపుగా 50 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక వేడి..
రాష్టంలో తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, భూపాలపల్లి, గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట జిల్లాలో అధిక వేడి ఉంటుందని పేర్కొంది .
హైదరాబాద్‌లో కూడా..
ఈ వారం మొత్తం హైదరాబాద్‌లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అత్యధికంగా 42-43 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
నేటి నుండి నుండి మే 7 వరకు వేడిగాలులు..
సూర్యాపేట, వనపర్తి మొదలైన ప్రాంతాల్లో ఈ వారంలో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నాలుగు జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో శనివారం నుంచి తీవ్రమైన హీట్‌వేవ్స్ కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు
ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖా అధికారులు సూచిస్తున్నారు. వడ దెబ్బ తగిలే అవకాశం ఉందని హెచ్చరించింది. దూర ప్రాంత ప్రయాణాలు మంచిది కాదని సూచించింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రయాణాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని పేర్కొంది.