'మహిళలపై దాడిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం'

కేసీఆర్ కు మద్యంపైన ఉన్న దృష్టి ప్రజాసమస్యలపై లేదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు షకీలారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత మండిపడ్డారు.

Update: 2023-06-09 16:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ కు మద్యంపైన ఉన్న దృష్టి ప్రజాసమస్యలపై లేదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు షకీలారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు అయినా ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరన్నారు. ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ ఆక్రమ రవాణాలో తెలంగాణ దేశంలోనే ముందుందని ఆరోపించారు. లైంగిక వేధింపులు పెరుగుతున్నా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఏర్పడినప్పుడు మద్యం ఆదాయంరూ.10 వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.30 వేల కోట్లుకు పైగా చేరిందన్నారు. పోర్న్ వీడియోల కట్టడిలో, మహిళలపై దాడులు అరికట్టడంలో షీటీంలు విఫలం అయ్యాయన్నారు. మహిళల సమస్యలపై ప్రభుత్వం ఆఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వరాష్ట్రం కోసం త్యాగాలు చేసిన కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉద్యమంలో ఆస్తులు పొగొట్టుకున్న కుటుంబాల గురించి ఆలోచించకుండా కేసీఆర్ కుటుంబం మాత్రం రూ.లక్షల కోట్లు దోచుకుంటున్నదని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని ధ్వజమెత్తారు. మహిళా సమస్యలపై త్వరలోనే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.


Similar News