సీఎం రేవంత్‌రెడ్డి సూచనపై తెలుగు ఫిల్మ్ చాంబర్ రియాక్షన్ ఇదే
సీఎం రేవంత్‌రెడ్డి సూచనపై తెలుగు ఫిల్మ్ చాంబర్ స్పందించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై సినీనటులతో అవగాహన కల్పిస్తూ షార్ట్ వీడియోలు తీసి ప్రభుత్వానికి ఇచ్చిన వారి సినిమాలకే ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) స్పందించింది. డ్రగ్స్, సైబర్ క్రైమ్‌ను అరికట్టేందుకు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వానికి సహకరిస్తామని టీఎఫ్‌సీసీ ప్రెసిడెంట్ దిల్ రాజు, కార్యదర్శులు కేఎల్ దామోదర ప్రసాద్, కె.శివప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తామని తెలిపారు.
కాగా, గత మంగళవారం బంజారాహిల్స్ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త సినిమాలు విడుదలయ్యే సందర్భంగా ఆ సినీ నటులతో డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ ఒకట్రెండు నిమిషాల నిడివి గల వీడియోలను ప్రభుత్వానికి అందించాలని అలా చేసిన సినిమాలకు మాత్రమే ప్రభుత్వం తరపున రావాల్సిన రాయితీలు, ప్రయోజనాలను కల్పిస్తామన్నారు. అలాగే డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రపై అవగాహన వీడియోలు ఉచితంగా ప్రదర్శించేందుకు ముందుకు వచ్చే థియేటర్లకే భవిష్యత్ లో అనుమతులు జారీ చేస్తామన్నారు. సామాజిక బాధ్యతగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.