ఆదాయ వనరులపై సర్కార్ ఫోకస్.. అధికారులకు CM కీలక ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేలా ఆదాయ వనరులపై ఫోకస్ పెట్టాలని వివిధ విభాగాల అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేలా ఆదాయ వనరులపై ఫోకస్ పెట్టాలని వివిధ విభాగాల అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పన్ను వసూళ్ళలో ఉదాసీనత పనికిరాదని, లీకేజీలను అరికట్టి టార్గెట్ ప్రకారం సంపూర్ణ స్థాయిలో వసూలయ్యేలా సిబ్బంది దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ లిక్కర్ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, సమగ్రమైన పాలసీతో ఇసుక రవాణాలోని లొసుగులకూ అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు మైనింగ్ శాఖ విధించిన జరిమానాలను పూర్తి స్థాయిలో వసూలు చేయాలన్నారు. ఎక్సయిజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్, మైనింగ్-జియాలజీ, కమర్షియల్ టాక్సెస్ తదితర విభాగాల ఉన్నతాధికారులతో సచివాలయంలో సోమవారం నిర్వహించిన రివ్యూ సందర్భంగా పై స్పష్టత ఇచ్చారు.
వాణిజ్య పన్నుల శాఖలో బడ్జెట్‌లో పెట్టుకున్న లక్ష్యానికి, రాబడికీ మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఎందుకు ఉందని ఆ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. జీఎస్టీ పరిహారం కింద గతేడాది వరకు సగటున రూ. 4 వేల కోట్లకు పైగా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందేదని, దాని గడువు ముగియడంతో ఆ నిధులు ఆగిపోయాయని, అందువల్లనే రాబడిలో వ్యత్యాసం కనిపిస్తున్నదని అధికారులు వివరించారు. మద్యం సరఫరా లెక్కలకు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విక్రయాలకు మధ్య కూడా గణాంకాల్లో తేడాలు ఉన్నాయని సీఎం గుర్తుచేశారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రతీ లిక్కర్ తయారీ డిస్టలరీ దగ్గర సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మద్యాన్ని సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ సౌకర్యాన్ని అమర్చి వాటిని ట్రాకింగ్ చేయాలని నొక్కిచెప్పారు. మద్యం బాటిళ్ళపై హైసెక్యూరిటీ స్టిక్కర్ల ద్వారా ట్రాకింగ్ సిస్టమ్‌ను పర్యవేక్షించాలన్నారు. మద్యాన్ని సరఫరా చేసే వాహనాలకు లోడ్‌కు తగినట్లుగా వే బిల్లులు కచ్చితంగా ఉండాలన్నారు. నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్‌తో పాటు గతంలో నమోదు చేసిన పలు కేసుల పురోగతిపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు చాలాచోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్ళారు.
కమర్షియల్ టాక్సెస్ డిపార్టుమెంటులోనూ అలాంటి పరిస్థితే కొనసాగుతున్నట్లు ఆ శాఖ కమిషనర్ డాక్టర్ శ్రీదేవి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి... ఆదాయాన్ని సమకూర్చే విభాగాలకు సొంత భవనాలు లేకపోవడం సరైన పద్ధతి కాదని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నూతన భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో సైతం ఈ శాఖలు సొంత భవనాల గురించి అప్పటి సీఎంకు, మంత్రులకు విన్నవించారు. కానీ సాకారం కాకపోవడంతో అదే సమస్య ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. తాజాగా సానుకూల స్పందన రావడంతో ఆ శాఖల ఆఫీసర్లకు రిలీఫ్ లభించింది.
హైదరాబాద్‌తో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో రహదారులపై కంకర కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారని, వివిధ ప్రదేశాల్లో ప్రభుత్వ స్థలాలను అందుకు వినియోగించాలని సీఎం సూచించారు. ఇసుక విక్రయాలపై సమగ్ర విధానం రూపొందించాలన్నారు. వే బిల్లులతో పాటు ఇసుక సరఫరా వాహనాలకు ట్రాకింగ్ ఉండాలని, అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను పలు గనులపై గతంలో జరిమానాలు విధించారని, కేసులు నమోదు చేశారంటూ గుర్తుచేసిన ముఖ్యమంత్రి... అలా విధించిన జరిమానాలను వెంటనే వసూలు చేయాలన్నారు. గతంలో జరిమానాలు విధించి తర్వాత వాటిని తగ్గించారని, అందుకు కారణాలు ఏమిటో తెలియజేయాలని, దానిపై నివేదిక సమర్పించాలని అధికారులకు స్పష్టం చేశారు.
స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో పాటు గనుల శాఖలో పలువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల తరబడి తిష్ట వేశారని, కొందరిపై ఆరోపణలున్నాయని, వారిని వెంటనే బదిలీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.