రేపే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. దానికి ముందే మరో కీలక ఘట్టం!

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఒకరోజు అసెంబ్లీ సెషన్ శనివారం జరగనున్నది.

Update: 2023-12-08 02:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఒకరోజు అసెంబ్లీ సెషన్ శనివారం జరగనున్నది. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు ప్రోటెమ్ స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉన్నది. సభలో సీనియర్లుగా ఉన్న ఎమ్మెల్యేలను ప్రోటెమ్ స్పీకర్‌గా ఎంపిక చేసుకోవడం ఆనవాయితీ. ఆ ప్రకారం సభలో ప్రస్తుతం కేసీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డి, అక్బరుద్దీన్, హరీశ్‌రావు తదితరులున్నారు. వీరు ప్రోటెమ్ స్పీకర్‌గా వ్యవహరించడానికి సంసిద్ధమైతే వారిచేత ప్రాసెస్ జరుగుతుంది. ఒకవేళ ఇష్టపడకపోతే ప్రత్యామ్నాయంగా ఇతరులను ఎంపిక చేసి ఆ ప్రక్రియను కంప్లీట్ చేయిస్తారు. ప్రోటెమ్ స్పీకర్‌గా ముందుకొచ్చే ఎమ్మెల్యే విధిగా రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సభలో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

కేవలం కొత్త ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం చేయించడానికి మాత్రమే ఈ సెషన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఫస్ట్ కేబినెట్ లో జరిగిన చర్చ మేరకు శనివారం అసెంబ్లీ సెషన్ ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. అయితే ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? ఏయే అంశాలను ఈ సమావేశాల్లో చర్చించాల్సి ఉన్నదనే వివరాలను మాత్రం మంత్రి వెల్లడించలేదు. శాసనసభ వర్గాల సమాచారం ప్రకారం కేవలం ప్రమాణ స్వీకారాలకే ఈ సెషన్ పరిమితమవుతున్నందున ఒక్క రోజుతోనే కంప్లీట్ అవుతుందని తెలిసింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తదితర కీలకమైన అంశాలను చర్చించడానికి మరో దఫా సెషన్ ఉండొచ్చని సమాచారం.

స్పీకర్‌గా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్

కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌గా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ను ఎంపిక చేసుకున్నది. ఆయన ఎన్నికే లాంఛనం కానున్నది. అయితే సభలో జరగాల్సిన ప్రాసెస్ కావడంతో తొలుత ఆయన పేరును ప్రతిపాదించడం, దానికి మద్దతు తెలపడం తదితర ప్రక్రియ జరగనున్నది. స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత ఆయన పేరును ప్రోటెమ్ స్పీకర్ లాంఛనంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత అధికార, విపక్ష పార్టీలు ఆయనను గౌరవ మర్యాదలతో సాదరంగా తోడ్కొని వెళ్లి సీటులో కూర్చోబెడతారు. స్పీకర్‌గా ఎన్నికైనందున ఆయనతో ఉన్న అనుబంధాన్ని అన్ని పార్టీల సభ్యులు సభలోనే పంచుకుంటారు. దీనికి ఒక రోజు సమయం పడుతుంది. ఆ రోజున ఎలాంటి చర్చల్లేకుండా సభ వాయిదా పడుతుంది.

దీనికి తోడు కొత్త ప్రభుత్వం ఏర్పడినందున ఫస్ట్ అసెంబ్లీ సెషన్‌లో గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం మాత్రమే కాక రాజ్యాంగ నిబంధన. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుని గవర్నర్ అనుమతితో సభా సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలనేది ఖరారవుతుంది. ఈ అన్ని కారణాలతో ప్రస్తుతం మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించిన వివరాల ప్రకారం కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఒక రోజుతోనే ముగించే అవకాశమున్నది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..