బ్రేకింగ్: టెన్త్ ఎగ్జామ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
తొమ్మిది, పదవ తరగతుల పరీక్షల విధానంలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 3వ తేదీ నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. గతంలో రెండు పేపర్ల విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఆరు పేపర్ల విధానానికే మొగ్గు చూపింది. కొవిడ్ తర్వాత నెలకొన్న పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వైరస్ పెరిగే అవకాశాలున్నాయన్న ఆదేశాలతో ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో 11 పేపర్లు ఉన్న సమయంలో ఒక్కో పరీక్షకు రెండున్నర గంటల సమయం ఉండేది. కానీ ఈసారి 6 పేపర్లకు చేయడంతో అరగంట సమయం పెంచి ప్రతీ సబ్జెక్టుకు 3 గంటల సమయం కేటాయించారు. కాగా సైన్స్ పరీక్షకు మాత్రం 3 గంటల 20 నిమిషాల వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా ప్రతీ ఏటా పదో తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహిస్తారు. కానీ ఈసారి ఏప్రిల్ మొదటి వారంలో ఎగ్జామ్స్ జరగనున్నాయి.
ఇక ఆరు పేపర్లే..
తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి తొమ్మిది, పదో తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనుంది. 2022-23 నుంచి సంస్కరణలను ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. సైన్స్‌పేపర్‌లో ఫిజిక్స్, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు కేటాయించనున్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 11వ తేదీతో ముగియనున్నాయి. కాగా ఓపెన్ ఎస్సెస్సీ విద్యార్థులకు 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సంస్కృతంతో పాటు, వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.
ఏ సబ్జెక్ట్‌కు ఎంత సమయం
గతంలో హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉండేవి. ఆ విధానానికి ప్రభుత్వం స్వస్తి చెప్పడంతో 6 పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా సైన్స్ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ కు చెరి సగం మార్కులు కేటాయించనున్నారు. సైన్స్ పరీక్షకు సమయం ఇతర పరీక్షలతో పోలిస్తే మరో 20 నిమిషాలు అదనంగా కేటాయించారు. ఫిజికల్ సైన్స్. బయోలజికల్ సైన్స్ కు చెరి గంటన్నర సమయం ఇచ్చారు. మధ్యలో ఫిజికల్ సైన్స్ సమాధాన పత్రాలు తీసుకునేందుకు, బయోలజికల్ సైన్స్ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చేందుకు 20 నిమిషాల సమయం కేటాయించారు. ఇదిలా ఉండగా కాంపోజిట్ కోర్సులు ఉంటే కూడా 3 గంటలకు మరో 20 అదనంగా సమయమిచ్చారు. ఒకేషనల్ విభాగం పరీక్షల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, ప్రస్తుత విధానం యథాతథంగా కొనసాగుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.
వంద శాతం సిలబస్‌తో పరీక్షలు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పదో తరగతి పరీక్షలను ఈ విద్యాసంవత్సరం వందశాతం సిలబస్ తో నిర్వహిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. టెన్త్ పరీక్షల సన్నద్ధతపై బుధవారం తన కార్యాలయంలో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ లేదని వెల్లడించారు. ఇందుకు సంబంధించి నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని పేర్కొన్నారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చిలో విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.