ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సర్కారు కొత్త రికార్డు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల శాఖ కొత్త రికార్డు నెలకొల్పింది.

Update: 2024-06-10 03:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల శాఖ కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్‌లో ఈనెల 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 8,35,109 మంది రైతులకు రూ.10,355.18 కోట్ల చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రోజులు, నెలలు తరబడి డబ్బుల కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బును జత చేశారు. చాలా చోట్ల ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిందని, మరో పది రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశముందని సివిల్ సప్లయిస్ విభాగం అంచనా వేస్తోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్‌‌లో 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్చి 25వ తేదీ నుంచే ప్రారంభించింది. వీటిలో 6,345 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. గతంలో ఏప్రిల్‌‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. ఈసారి రెండు వారాలు ముందుగానే ప్రభుత్వం కేంద్రాలను ప్రారంభించడంతో రైతులకు ప్రయోజనం చేకూరింది. కొన్ని జిల్లాల్లో ఆలస్యంగా పంటలు వేసిన రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు జూన్ చివరి తేదీ వరకు అవసరమైన చోట్ల కేంద్రాలు తెరిచి ఉంచాలని పౌర సరఫరాల శాఖ అన్ని జిల్లాల డీఎం, డీఎస్‌వోలకు ఆదేశాలు జారీ చేసింది.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈసారి సివిల్ సప్లయిస్ విభాగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని సివిల్ సప్లయిస్ విభాగం మొదట్లో అంచనా వేసింది. కానీ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ రేటు రావటం, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మంచి ధరకు కొనుగోలు చేయటంతో కేంద్రాలకు వచ్చే ధాన్యం అంచనా తగ్గింది.


Similar News