గురుకులాలతోనే సరి.. ఆ విషయంలో తెలంగాణ సర్కార్ అట్టర్ ఫ్లాప్..!

రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అని గొప్పలు చెప్పిన కేసీఆర్ సర్కార్.. అందుకు అనుగుణంగా కాలేజీల ఏర్పాటులో తీవ్రంగా విఫలమైంది.

Update: 2022-12-26 00:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అని గొప్పలు చెప్పిన కేసీఆర్ సర్కార్.. అందుకు అనుగుణంగా కాలేజీల ఏర్పాటులో తీవ్రంగా విఫలమైంది. కేవలం గురుకులాలతోనే సరిపెట్టి తూతూమంత్రంగా కొనసాగిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీల్లోనే విద్య కొనసాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొత్తగా ఏర్పడిన జూనియర్ కాలేజీలు ఆరంటే ఆరు మాత్రమే ఉన్నాయి. ఇక పాలిటెక్నిక్ కాలేజీల విషయానికి వస్తే కేవలం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే కొత్తది ఏర్పాటుచేశారు. ఇక ఇంజినీరింగ్ కాలేజీ విషయానికొస్తే కేవలం రెండు మాత్రమే నిర్మించారు. ఇక రాష్ట్రంలో వందలాది గురుకులాలు ఏర్పాటు చేశామని గొప్పులు చెప్పుకుంటున్న సర్కార్ వాటిలోనూ విద్యార్థులకు అరకొర వసతులే కల్పిస్తోంది. సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. భోజనం విషయానికొస్తే కల్తీ ఆహారంతో విద్యార్థులు తీవ్రస్థాయిలో అస్వస్థతకు గురైంది తెలిసిందే.

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. కేజీ టు పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని గొప్పలు చెప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావ్ పేటలో మొట్టమొదటి కేజీ టు పీజీ విద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అది కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎనిమిదిన్నరేండ్లకు ప్రభుత్వం నిర్మించింది. అందులోనూ మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం కావడంతో ఇది సాధ్యమైంది. మంత్రి సెగ్మెంట్లలోనే ఏర్పాటుకు ఎనిమిదిన్నరేండ్ల సమయం పడితే ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లలో అయితే ఎన్నేండ్లు పడుతుందోననే విమర్శలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. 2014 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో యూనివర్సిటీల స్థాపనతో, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటులో సీమాంధ్ర పాలకులు తెలంగాణను విస్మరించారని పేర్కొంది. విద్యా వికాసం లేనిచోట సమాజ వికాసం జరగదని స్పష్టం చేసింది. కానీ తెలంగాణ ఏర్పడ్డాక కూడా కొత్త కాలేజీల ఏర్పాటు అతి తక్కువగా ఉండటం కేసీఆర్ సర్కార్‌కు విద్యా వ్యవస్థపై ఉన్న వివక్ష స్పష్టంగా అర్థమవుతోంది.

స్వరాష్ట్రంలో ప్రతి జిల్లాకో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చిన సర్కార్ ఇంతవరకు నెరవేర్చలేకపోయింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేవలం రెండు ఇంజినీరింగ్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు చేసింది. అందులోనూ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేస్తే.. మరొకటి వనపర్తి జిల్లాలో ఏర్పాటుచేసింది. వనపర్తిలో జేఎన్ టీయూ కాలేజీ ఈ విద్యాసంవత్సరమే అందుబాటులోకి రావడం గమనార్హం. సిరిసిల్లలోని కాలేజీ 2021లో ప్రారంభమైంది. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అయితే ప్రతి నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటుచేస్తామని మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పేర్కొంది. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ హామీలను తెలంగాణ సర్కార్ విస్మరించింది.

ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక అదికూడా ఈ విద్యాసంవత్సరం(నవంబర్ 30) నాటికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కొత్త పాలిటెక్నిక్ కాలేజీని సిద్ధం చేసింది. ఇదిలా ఉండగా సమైక్య రాష్ట్రంలో 401 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉంటే రాష్ట్ర విభజన తర్వాత ఆరు కాలేజీలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేయడం గమనార్హం. దీన్నిబట్టి తెలంగాణ ప్రభుత్వానికి విద్యాశాఖపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. సమైక్య రాష్ట్రమైనా, స్వరాష్ట్రమైనా ప్రభుత్వాలకు విద్యారంగంపై ఉన్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రభుత్వ కాలేజీలకు వచ్చేది నిరుపేద విద్యార్థులు మాత్రమే. కార్పొరేట్ కాలేజీల్లో లక్షల కొద్దీ ఫీజులు చెల్లించే స్థోమత లేక విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థలకే మొగ్గుచూపుతారు. కానీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా కాలేజీల సంఖ్య పెంచడంలో తీవ్రంగా విఫలమైంది. దీంతో వచ్చేవారు కూడా ప్రైవేట్ కళాశాలల వైపునకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో తల్లిదండ్రులకు తమ పిల్లలను చదివించడం కష్టతరంగా మారింది. అప్పుల మీద అప్పులు చేస్తూ ఊబిలో చిక్కుకుంటున్నారు. పలువురు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కించడంపై సర్కార్ దృష్టిసారించాలని తల్లిదండ్రులు వాపోతున్నారు. కొత్త జూనియర్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటును ఇప్పటికైనా చేపట్టాలని డిమాండ్లు చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా? వచ్చే ఎన్నికల్లో అధికారం ఇస్తే చేస్తామని మరో హామీనిచ్చి దాటవేస్తుందా? అనేది వేచిచూడాల్సిందే.

Also Read...

తెలంగాణ సర్కార్ మాస్టర్ ప్లాన్.. గంటల వ్యవధిలోనే రూ.5080 కోట్ల పంచాయతీ నిధులు మాయం..!! 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..