వెల్త్ క్రియేటర్లకు తెలంగాణ సర్కార్ ఆల్‌వేస్ వెల్ కమ్: డిప్యూటీ CM భట్టి విక్రమార్క

రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు తెచ్చే వెల్త్ క్రియేటర్లకు ప్రభుత్వం ఎప్పటికీ ఆహ్వానం పలుకుతూనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Update: 2024-01-22 14:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు తెచ్చే వెల్త్ క్రియేటర్లకు ప్రభుత్వం ఎప్పటికీ ఆహ్వానం పలుకుతూనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్ధిక వృద్ధికి తోడ్పడే వ్యవస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. థేమ్స్ నది మాదిరిగా మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. మూసీ నది శుద్దితో సుందరీకరణ జరిగి, పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు.

ఆధునాతన ఫుడ్ కోర్టులు,ఎంటర్టైన్ మెంట్ ఈవెంట్లు జరిగే అవకాశం ఉన్నదని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ప్రధాన శక్తిగా మారుతుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడానికి శివారు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇక రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ధరణి పై తగు సూచనలు, సలహాలను ఇస్తే తనతో పాటు ధరణి పై ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించి ప్రజలకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటుందన్నారు. డబ్బులు కట్టి గత రెండు మూడేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

డిప్యూటీ సీఎంకు స్పెషల్ నివేదిక..?

మరోవైపు రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి పలు సూచనలను నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రికి నివేదిక రూపంలో అందచేసింది. భవన నిర్మాణ రంగ అభివృద్ధికి 'రేరా' ఏర్పాటైనందున అనుమతులకు ప్రస్తుతం ఉన్న10 శాతం మార్టగేజ్ విధానాన్ని ఎత్తి వేయాలని నివేదికలో కోరారు. రాష్ట్రంలో అధికంగా ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గిస్తూ, జీవో నెంబరు 50ను ఎత్తివేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న లక్షలాది ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, తద్వారా పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభమై ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.

టీఎస్ బీ-పాస్ క్రింద వివిధ ప్రాజెక్టులపై సమర్పించిన దరఖాస్తులు రంగారెడ్డి జిల్లాలో గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, దీనివల్ల ఎన్నో ప్రాజెక్టులు నిలిచి పోయాయన్నారు. గత ఆరు నెలల నుండి ఎన్విరాన్ మెంట్ కమిటీ లేదని, వెంటనే ఆ కమిటీని వేయాలని కోరారు. భవన నిర్మాణాలకు తీసుకుంటున్న తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లకు యూనిట్ కు రూ.9 నుండి 14 రూపాయలకు పెంచారని దీనిని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధులు మేకా విజయ సాయి, శ్రీధర్ రెడ్డి, కాళీ ప్రసాద్, దశరథ్ రెడ్డి, చలపతి రావు, భూపాల్ రెడ్డి, మారోజు శ్రీధర్ రావు, అశోక్, రామి రెడ్డి వెంకట్ రెడ్డి, కె.కె.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News