హఠాత్తుగా ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోతే ఏం చేయాలి!

కార్డియాక్ అరెస్టులతో రాష్ట్రంలో మరణాలు పెరిగిపోతుండడంతో సర్కారు అలర్ట్ అయింది.

Update: 2023-02-26 17:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కార్డియాక్ అరెస్టులతో రాష్ట్రంలో మరణాలు పెరిగిపోతుండడంతో సర్కారు అలర్ట్ అయింది. క్షేత్రస్థాయిలో అప్పటికప్పుడు స్పందించే వారుంటే సీపీఆర్ ద్వారా ఇలాంటి మరణాలను కొంతవరకైనా అరికట్టవచ్చని భావిస్తున్నది. అందుకే ఫ్రంట్ లైన్ వర్కర్లకు సీపీఆర్ పై శిక్షణ ఇచ్చేందుకు రెడీ అయింది. రోడ్లు, కార్యాలయాలు, ఇతర ప్రదేశాలలో ఛాతి నొప్పితో సృహ తప్పి పడిపోయినోళ్లకు తక్షణమే ఎలాంటి ప్రాథమిక వైద్యం అందించాలనే అంశంపై ట్రైనింగ్ ఇవ్వనున్నది. ఎలా చేయాలి? ఏ సందర్భాల్లో చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

ఫస్ట్ ఆశాలు, ఏఎన్ఎంలకు టీచింగ్ ఆస్పత్రుల్లోని హెచ్ఓడీల పర్యవేక్షణలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఒక్కో జిల్లాలో రెండు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరో రెండు రోజుల్లో సీపీఆర్ పై శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. పోలీసులు, మున్సిపల్‌ ఉద్యోగులు, ఇతర కార్మికులకూ సీపీఆర్‌లో శిక్షణ ఇస్తామని చెప్పారు. దీంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాలు, జిమ్‌లలో ఎంపిక చేసిన వారితో పాటు, 108 సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలకు విడతల వారీగా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు..

హఠాత్తుగా ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోతే వెంటనే సమీపంలో ఉన్నవారు రెండు చేతులతో ఛాతీపై బలంగా నొక్కాలి. అలా 20-30 సార్లు చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. ఆ తర్వాత రెండు ముక్కు రంధ్రాలు మూసి నోటిలోకి గట్టిగా గాలి ఊదాలి. ఇలా రెండుమూడు సార్లు చేయాలి. ఈ సీపీఆర్‌ వల్ల గుండెపై ఒత్తిడి పడి మళ్లీ గుండె కొట్టుకునే అవకాశం ఉంటుందని, దీంతో సదరు వ్యక్తిని ఆస్పత్రికి తరలించే వరకు ఎలాంటి ప్రాణపాయం కలగదని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, గుండె కొట్టుకోవడంలో సమస్యలు, గుండె కండరం దళసరిగా ఉండటం, కుటుంబీకులకు ఈ రకమైన చరిత్ర ఉండటం, ఒత్తిడి వంటి కారణాలతో సడెన్ కార్డియాక్ అరెస్టులు వస్తున్నాయని డాక్టర్లు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News