CM Revanth Reddy: 'దమ్ముంటే కేంద్ర కమిటీని పంపు'.. మోడీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్
తెలంగాణలో ఎన్నికల వాగ్దానాల అమలుపై ప్రధాని మోడీ చేస్తున్న విమర్శలపై తెలంగాణ సీఎం రెడ్డి సవాల్ విసిరారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై బీజేపీ (BJP) చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీపై దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం తరపున ఓ కమిటీ వేసి తెలంగాణకు పంపించాలని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పెద్దలకు సవాల్ విసిరారు. రాష్ట్రానికి వచ్చేందుకు మీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పాలని.. నేనే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తానని చాలెంజ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్ని సీఎం రేవంత్.. ఇవాళ పుణేలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మేం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేసి చూపించామన్నారు. 25 రోజుల్లో రూ.18 వేల కోట్లతో 23 లక్షల మంది రైతులకు రుణవిముక్తి కల్పించామన్నారు. కేంద్ర కమిటీ రాష్ట్రానికి వస్తే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇస్తామన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే నేతృత్వంలో రైతులకు ఇచ్చిన అతి పెద్ద గ్యారెంటీ రుణమాఫీని అమలు చేశామన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతులు, పేదలు, నిరుద్యోగుల కోసం ఏమి చేయలేదని, ఇన్ని వైఫల్యాలు వారి వైపు ఉన్నప్పటికీ ప్రధాని మోడీ మా గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. సన్న రకం వరిపై ఎంఎస్పీ మీద రూ.500 బోనస్‌ను రైతులకు ఇస్తున్నామన్నారు.
11 ఏళ్లలో మోడీకి సక్సెస్ స్టోరీనే లేదు
కాంగ్రెస్ గ్యారెంటీ అంటే భారతీయ ఝూటా పార్టీ గ్యారెంటీ, మోడీ గ్యారెంటీ కాదని సీఎం రేవంత్ విమర్శించారు. రాజకీయాల్లో నష్టం వచ్చినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఆరు నూరైనా హామీలన్నీ అమలు చేసి తీరుతామన్నారు. ప్రధాని మోడీకి (PM Narendra Modi) ఈ 11 ఏళ్లలో ఎలాంటి సక్సెస్ స్టోరీ లేదని, మహారాష్ట్రలో కోవర్ట్ అపరేషన్ పాలిటిక్స్ నడిపారని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, అశోక్ చౌహాన్ వారి పార్టీలకు వెన్నుపోటు పొడిచి మోడీకి గులాములుగా మారి ముంబయిని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం వేళ పీఎం మోడీ విదేశీ పర్యటనకు వెళ్లడం ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని అంగీకరించిందని విమర్శించారు.