గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం
తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాదు.. 2008 DSC అభ్యర్థులకు ఉద్యోగాలపై కసరత్తుకు నిర్ణయం, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రూ.22,500 కోట్ల మంజూరు ఆమోదం, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు కొత్త కార్పొరేషన్లు, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మహిళా రైతుబజార్ల ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకున్నారు.
కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా కూడా రేషన్ కార్డుల ఊసెత్తక పోవడంతో ఇబ్బంది పడుతున్న అర్హులకు ఈ వార్త కాస్త ఉపశమనం ఇవ్వనుందని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను రేషన్ కార్డు ఉన్నవారికే ఇస్తామని చెప్పడంతో కార్డులు లేని వాళ్లు ఆ పథకాలను అందుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డులపై ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేశారు. తాజాగా.. ఇవాళ నిర్వహించిన కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.