రేపటి నుంచి అసెంబ్లీ.. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరు?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఈ నెల13కు వాయిదా పడే చాన్స్ ఉన్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఈ నెల13కు వాయిదా పడే చాన్స్ ఉన్నది. అసెంబ్లీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సమావేశాలు ఈ నెల 6, 13, 14 తేదీల్లో జరగనున్నాయి. స్పీకర్ అధ్యక్షతన తొలి రోజున జరిగే బిజినెస్ అడ్వయిజరీ సమావేశంలో తేదీల ఖరారు, చర్చించాల్సిన అంశాలు, ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టనున్న తీర్మానాలు, సీఎం స్టేట్‌మెంట్లు, చట్ట సవరణ బిల్లులు తదితరాలపై క్లారిటీ రానుంది. కానీ ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు చర్చకు రానున్నాయని, అనంతరం ఏకగ్రీవ ఆమోదంతో తీర్మానాలుగా మారి కేంద్రానికి పంపే అవకాశం ఉన్నట్టు సమాచారం. సమావేశాల నిర్వహణపై శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సంయుక్తంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీసు కమిషనర్లు, అసెంబ్లీ కార్యదర్శి తదితరులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. సమావేశాలకు తగిన పోలీసు భద్రత కల్పించాల్సిందిగా ఆదేశించారు. కరోనా టెస్టింగ్ సెంటర్‌తో పాటు అవసరమైనమ వారికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌ను ఇచ్చే ఏర్పాట్లు చేయాల్సిందిగా వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి అధికారులు అందుబాటులో ఉండాలని, పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు కూడా సమాధానాలను సిద్ధం చేసి అసెంబ్లీకి అందజేయాలని స్పష్టం చేశారు.
ఎఫ్ఆర్ఎంబీపై తీర్మానం?
ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నదని, అవసరంలేని ఆంక్షలను విధిస్తున్నదని సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని స్టేట్‌మెంట్లను సభలో ప్రవేశపెట్టి చర్చల అనంతరం తీర్మానాలుగా ఆమోదించి ఢిల్లీకి పంపాలని ఆలోచిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాల సమాచారం. రిజర్వు బ్యాంకు నుంచి తీసుకునే అప్పుల విషయంలో రెండేండ్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకుని బడ్జెటేతర రుణాలతో ముడిపెట్టి ఆంక్షలు విధించడంపై ఈ సమావేశాల్లో తీర్మానం చేసే ఆలోచన ఉన్నట్టు తెలిసింది. ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని గతంలో చేసిన విజ్ఞప్తిని మరోసారి గుర్తుచేసేలా తీర్మానాన్ని ఆమోదించే చాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలకు మూడేండ్లుగా ఆర్థికసాయం చేయకపోవడంపై ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా.. సానుకూల స్పందన రాకపోవడంతో ఇందుకు నిరసనగా అసెంబ్లీలో ప్రకటన చేసే చాన్స్ ఉంది. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదనే ఆరోపణల నేపథ్యంలో దీనిపైనా అసెంబ్లీలో చర్చించే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సెప్టెంబరు 17 ఉత్సవాలను నిర్వహిస్తున్నందున దీనిపైన సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సాయుధ రైతాంగ పోరాటం, నిజాం పాలనలో మతసామరస్యం, అన్ని మతాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ ప్రార్థనాలయాలను నిర్మించడం తదితర అంశాలను ప్రస్తావించవచ్చని తెలిసింది. వీటితో పాటు కొన్ని చట్టాలకు సవరణ చేసే ఉద్దేశంతో బిల్లులను కూడా ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తున్నది. సమాచారం. కొన్ని కీలక ప్రకటనలు ఉంటాయని తెలిసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరదలతో జరిగిన నష్టం, కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందకపోవడం తదితరాలపైనా చర్చించే చాన్స్ ఉంది.
బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరు?
బీజేపీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రాజాసింగ్ జైలులో ఉన్న కారణంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమావేశాలకు హాజరుకానున్నారు. బీజేపీ శాసనసభా పక్ష నేత బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను ఆ పార్టీ తొలగించినందున ఆయన స్థానాన్ని ఈటల రాజేందర్ కు ఇస్తుందా? లేక రఘునందన్ రావుకు ఇస్తుందా? అనే విషయంపై క్లారిటీ రాలేదు. శాసనసభా పక్ష నేత లేకుండానే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరుకానున్నారు.