రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను బాయ్‌కాట్ చేస్తున్నాం.. తెలంగాణ ఉద్యమకారుడి షాకింగ్ స్టేట్‌మెంట్
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధమైంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అధికారంలో ఉండటంతో ఊహించని రేంజ్‌లో నిర్వహణకు రెడీ అయింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధమైంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అధికారంలో ఉండటంతో ఊహించని రేంజ్‌లో నిర్వహణకు రెడీ అయింది. ఈ ఆవిర్భావ సెలబ్రేషన్స్‌కు కాంగ్రెస్ అగ్ర నాయకురాలిని తీసుకొచ్చేందుకు ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. గత కొన్ని రోజులుగా ఫోన్లలోనే సంప్రదింపులు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మంగళవారం నేరుగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించారు. ఆమె తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు వచ్చేందుకు సానుకూలంగా ఉన్నారని సీఎం స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంతోషం వ్యక్తం అవుతున్నది.
పరేడ్ గ్రౌండ్ వేదికగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులంతా ప్రభుత్వంలో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారిని సీఎం రేవంత్ తన పక్కన పెట్టుకున్నారని సీరియస్ అయ్యారు. విద్యార్థుల త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. ఏ ఒక్క నాయకుడి వల్ల రాష్ట్రం రాలేదని అన్నారు. మళ్ల ఏపీలో చంద్రబాబు గెలిస్తే తెలంగాణ, ఆంధ్రా కలిసిపోతాయేమోనని భయం వేస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని తాము బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు.