చంద్రబాబుతో కృష్ణారెడ్డి భేటీ.. సీనియర్ నేతల్లో అసంతృప్తి.. టీటీడీపీ దారెటు..?
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సోమవారం భేటీ అయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో : టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం కలిశారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి రావాలని వారిద్దరు చంద్రబాబుకు శుభలేఖ అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రాజకీయాలపై చర్చించారు. పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కొంతకాలంగా తీగల టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో పార్టీ మనుగడ సాగించాలంటే రెడ్డి సామాజిక వర్గంతోనే సాధ్యమని పార్టీ అధిష్టానం భావించే తీగలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని విశ్వసనీయ సమాచారం. తీగలకు గ్రేటర్ మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉండటం, అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉండటంతో కలిసి వస్తుందని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుపైనా చర్చలు?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి టీటీడీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. నాయకత్వ లేమీతో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన వారు ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో పాటు కొంత మంది నాయకులు, కేడర్ వారితో వెళ్లింది. దీంతో పార్టీకి తీవ్రనష్టం జరిగింది. అలాంటి పరిస్థితులకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతూ గతానికి భిన్నంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేసి పటిష్టమైన వ్యక్తికి బాధ్యతలు అప్పగించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నారా బ్రాహ్మణిని నియమిస్తారనే ప్రచారం జరిగింది. బ్రాహ్మణికి బాధ్యతలు అప్పగించకపోతే మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనకు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. మిగిలిన సీనియర్ మహిళా నేతలకు కమిటీలో ప్రాధాన్యత ఇస్తారని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అయి పార్టీ కమిటీపై క్లారిటీ ఇస్తారని తెలిసింది.
సీనియర్ నేతల్లో అసంతృప్తి
టీడీపీలో 30 ఏండ్లుగా పని చేస్తున్న సీనియర్ నేతలున్నారు. తెలంగాణలో అధికారం లేకపోయినా అందులోనే కొనసాగుతున్నారు. పార్టీ అధిష్టానం గుర్తించి ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు కొనసాగుతుండగా, సీనియర్ నేతలు రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా పని చేస్తున్నారు. అయితే వారు సైతం పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఊహించని విధంగా తీగల కృష్ణారెడ్డి.. చంద్రబాబుతో భేటీ కావడం, అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో సీనియర్ నేతలంతా అసంతృప్తికి గురవుతున్నారు. కష్టపడి పని చేస్తున్న తమను కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబుతో మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి భేటి
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి సైతం సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి రావాలని శుభలేఖ అందజేశారు. అయితే వీరు బాబును కలవడం పొలిటికల్‌గా చర్చ జరుగుతున్నది. కొన్ని నెలల క్రితం మల్లారెడ్డి నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారని, వారి అభిప్రాయం మేరకు టీడీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. తర్వాత ఆ ప్రచారానికి పుల్‌స్టాప్ పడింది. ఈ క్రమంలో మామా అల్లుళ్లు మళ్లీ చంద్రబాబుతో భేటీ కావడం చర్చకు దారి తీసింది.