తెలంగాణ విషయంలో Chandra Babu భారీ స్కెచ్!
తెలంగాణలోని అధికార పార్టీ పేరు మార్చుకుని బీఆర్ఎస్‌గా అవతరించిన వేళ రాజకీయం మరింత ఆసక్తిగా మారుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని అధికార పార్టీ పేరు మార్చుకుని బీఆర్ఎస్‌గా అవతరించిన వేళ రాజకీయం మరింత ఆసక్తిగా మారుతోంది. తాజాగా తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టడం సంచలనం రేపుతోంది. మరో ఏడాది లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఇటీవలే టీటీడీపీ అధ్యక్షుడిని మార్చిన చంద్రబాబు.. ఈ నెల 21న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈ మేరకు టీడీపీ తమ్ముళ్లు గ్రౌండ్ వర్క్ పూర్తి చేస్తున్నారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరగబోయే బహిరంగ సభకు ఆ పార్టీ నేతలు కసరత్తు వేగవంతం చేశారు. ఈ సభకు భారీగా జన సమీకరణ చేసి తమ బలమేంటో ప్రదర్శించేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు జెండా ఊపి 30 ప్రచార రథాలను ప్రారంభించారు.
చంద్రబాబు సభతో రాష్ట్రంలో పెను మార్పులు:
బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న వేళ చంద్రబాబు వ్యూహ రచన రాష్ట్రంలో ఆసక్తిగా మారుతోంది. ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్త మార్పును కోరుకుంటున్నారని ఖమ్మం జిల్లా సభ దీనికి అంకురార్పణ అవుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ సభలో అధికార బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగలబోతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. గతంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి ఇటీవల సైలెంట్ అయిన నేతలను తిరిగి టీడీపీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవలే పార్టీ అధ్యక్షుడైన కాసాని జ్ఞానేశ్వర్‌ను పార్టీలోకి ఆహ్వానించి ఏకంగా తెలంగాణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇదే వ్యూహాన్ని ఆయా జిల్లాలో అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం సభలో ఈ మేరకు పార్టీలో చేరికలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు టీడీపీ నేతలతో తరచూ భేటీ అవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్‌లో తలెత్తుతున్న విభేదాల కారణంగా ఆయన త్వరలోనే పార్టీ వీడుతారనే చర్చ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభతో పెను మార్పులు వస్తాయని టీడీపీ నేతలు చెబుతున్న మాటలకు అర్థం ఇదేనా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు తెలంగాణపై దృష్టి సారించడం వెనుక పక్కా లెక్కలు ఉన్నాయనే టాక్ ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో టీడీపీకి 14 సీట్లు దక్కాయి. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకుంది. తమకు పట్టు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే మరోసారి తన ప్రయత్నానికి చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు. ఖమ్మంలో పార్టీకి చెప్పుకోదగిన క్యాడర్ ఉండటంతో అక్కడి నుంచే తెలంగాణ రాజకీయాల్లో కీలక రోల్ పోషించాలని బాబు మనసులోని వ్యూహంగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ ప్రయత్నం ఫలించి చెప్పుకోదగిన సీట్లు వస్తే కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంటుందని, ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దనే ఉద్దేశంతోనే బాబు తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు పేరు చెబితేనే చిటపటలాడే కేసీఆర్ ఈ సారి ఆయన చేస్తున్న ప్రయత్నంపై అధికార పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read...