టార్గెట్ కాంగ్రెస్! BRS ప్రధాన ప్రచారాస్త్రం రెడీ
కాంగ్రెస్ టార్గెట్‌గా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ టార్గెట్‌గా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. రాబోయే ఎన్నికల్లో ఉచిత విద్యుత్‌ను ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదన్న రేవంత్ ప్రకటనతో ఎన్నికల వరకూ నిరసనలు, చర్చావేదికలు, సమావేశాల్లోనూ ఎండగడుతూ సాగదీసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటికే ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ స్లోగన్ ఇస్తున్న కేసీఆర్ రైతుల్లో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని పార్టీ శ్రేణులకు, రైతులకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే నిరసనలు, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు.
రేవంత్ వ్యాఖ్యలే అస్త్రంగా..
కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతుండటంతో కట్టడికి అధిష్టానం వ్యూహాలను రచిస్తుంది. ఈ తరుణంలోనే రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు అవసరం లేదని, 3 గంటలు చాలనే ప్రకటన బీఆర్ఎస్‌కు అస్త్రం దొరికినట్లయింది. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ అని, ఆ పార్టీకి ఓట్లు వేస్తే పాత రోజులు వస్తాయని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ ప్రారంభించింది. అందులో భాగంగానే రెండు రోజుల నిరసన కార్యక్రమాలకు అధిష్టానం పిలుపునిచ్చింది.
గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి ఆదేశాలిచ్చింది. పార్టీ శ్రేణులతో రైతులను భాగస్వాములను చేయాలని నేతలకు సూచించింది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే 20 ఏళ్ల క్రితం ఉన్న రోజులు మళ్లీ వస్తాయని, చీకట్లు కమ్ముతాయని, కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు, ఎండిన పంటలు.. రైతుల ధర్నాలతో పరిస్థితులు దారుణంగా ఉంటాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనుంది.
ఉచిత విద్యుత్‌పై..
వ్యవసాయానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని, విద్యుత్ రంగంపై వేల కోట్లు వెచ్చించి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తుందనే అంశాన్ని వివరించనున్నారు. 27లక్షల బోరుబావులకు ఉచిత కరెంటు ఇస్తున్న విషయాన్ని ప్రచారం చేయనున్నారు. ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసి మోటార్లుకు మీటర్లు పెట్టాలని రాష్ట్రం మెడపైన కత్తిపెట్టినా ప్రభుత్వం లొంగిపోలేదని, 24 గంటల ఉచిత కరెంట్‌ను కాపాడుకోవడం కోసం ఏకంగా రూ. 30వేల కోట్లను వదులుకున్నదనే విషయాన్ని నేతలంతా సమావేశాలు నిర్వహించి వివరించే ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా రైతు బీమా, రైతుబంధు తదితర పథకాలను సైతం వివరించాలని అధిష్టానం భావిస్తుంది. రైతుపచ్చగా ఉంటే కాంగ్రెస్ నేతలకు కళ్లు మండుతున్నాయని, అందుకే కుట్రలు చేస్తుందనే అంశాన్ని విస్తృత ప్రచారం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ప్రజల్లో ఆ పార్టీని దోషిగా నిలపాలని భావిస్తున్నారు.