కార్మికులను అమితంగా ప్రేమించిన మహానేత NTR: కాసాని జ్ఞానేశ్వర్
దోపిడీ పాలన పోయి కార్మికులకు, పేద వర్గాలకు మంచి జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: దోపిడీ పాలన పోయి కార్మికులకు, పేద వర్గాలకు మంచి జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన అన్ని అనుబంధ సంఘాలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం ఎన్టీఆర్ భవన్లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 'మే డే' వేడుకలను టీఎన్టీయూసీ (తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కే బోస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. సమాజమే దేవాలయమని.. ప్రజలే దేవుళ్లని నమ్మి ఆ దిశగా రైతులను, కార్మికులను, కర్షకులను అమితంగా ప్రేమించి గౌరవించిన మహా నేత ఎన్టీఆర్ అని అన్నారు.
కార్మిక శక్తి ఆజేయమైనదని భావించిన ఆయన తెలుగుదేశం పార్టీలో తెలుగునాడు పేరిట కార్మిక విభాగాన్ని నెలకొల్పి ఆ వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. ఆనాడు కార్మిక సంఘాలకు అంకితభావం కలిగిన నాయకత్వం ఉండి అధికారంలో ఎవరు ఉన్నా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసి కార్మికుల న్యాయం చేసేవారన్నారు. ప్రపంచంలో కార్మికులు లేని చోటు అంటూ ఏదీ లేదని, ఈ వర్గాలు లేనిదే మానవ మనుగడ ముందుకు సాగదన్నారు. కార్మిక సంఘాలు పాలకపక్షాలపై గట్టగా పోరాటం చేయకపోవడం వల్ల ఐడీపీఎల్ వంటి ఎన్నో పెద్ద కంపెనీలు ఇప్పుడు మూతపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన 20 మంది కార్మికులకు ఎన్టీఆర్ కార్మిక రత్న అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, పెద్దోజు రవీంద్రచారి, సంద్యపోగు రాజశేఖర్, కనగాల సాంబశివరావు, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బి.షకీలా రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పొలంపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.