T Congress: అప్పుడు మీ స్వీయ రాజకీయ అస్తిత్వం గుర్తుకు రాలేదా..? టీ కాంగ్రెస్ కౌంటర్

మోడీని గులాబీ పూలతో పూజించిన బానిసలకు మాట్లాడే అర్హత ఉందా? అంటూ.. ఆ సమయంలో స్వీయ రాజకీయ అస్తిత్వం గుర్తుకు రాలేదా అని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

Update: 2024-07-23 15:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మోడీని గులాబీ పూలతో పూజించిన బానిసలకు మాట్లాడే అర్హత ఉందా? అంటూ.. ఆ సమయంలో స్వీయ రాజకీయ అస్తిత్వం గుర్తుకు రాలేదా అని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. తెలంగాణలో 16 ఎంపీ స్థానాలను జాతీయ పార్టీలకు ఇస్తే కేంద్ర బడ్జెట్ లో దక్కింది గుండు సున్నా అని బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఒక సారి 11 సీట్లు.. మరోసారి 9 సీట్లు.. ఇవి కాక రాజ్యసభ అన్ని కలిపి మొత్తం 10 ఏండ్ల పాటు మోదీ పాదాల దగ్గర పెట్టి “గులాబీ” పూలతో పూజ చేసిన బానిసలకు మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించింది. టీఆర్ఎస్ వద్దు బీఆర్ఎస్ ముద్దు అన్నప్పుడు, తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని పక్క రాష్ట్రాల్లో నాయకులను కొనడానికి దుర్వినియోగం చేసినప్పుడు రాజకీయ ఆరాటమే తప్ప రాష్ట్ర అస్థిత్వం గుర్తుకు రాలేదా అని మండిపడింది. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. పంజాబ్ రైతుల మెహర్బానీ కోసం అర్రులు చాచినప్పుడు రాజకీయ ఆరాటమే తప్ప రాష్ట్ర అస్థిత్వం గుర్తుకు రాలేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

పదేళ్లు పంచాయతీల నుండి పార్లమెంట్ వరకు మొత్తం మీరే ఉన్నప్పుడు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు, పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీ సహా ఒక్కటంటే ఒక్కటి కూడా మోదీ ఇవ్వనప్పుడు ఎక్కడకు పోయింది మీరు వల్లించే “ స్వీయ రాజకీయ అస్థిత్వం” అని సంచలన వ్యాఖ్యలు చేశింది. అలాగే ఏ స్వీయ ప్రయోజనాల గుప్పిట నలిగిపోయింది “మీ స్వీయ రాజకీయ అస్థిత్వం” అని బీఆర్ఎస్ ను నిలదీశింది. ఇక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేది కూడా కాంగ్రెస్ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. కాగా తెలంగాణలో 8 బీజేపీకి, 8 కాంగ్రెస్ కు మొత్తం 16 ఎంపీ స్థానాలను జాతీయ పార్టీలకు ఇస్తే ఈ బడ్జెట్ లో దక్కింది గుండు సున్నా అని, అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..