ఢిల్లీకి చేరిన టీ కాంగ్రెస్ పాలిటిక్స్... బీఆర్ఎస్ విషయంలో ఏఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ!
టీ కాంగ్రెస్ పాలిటిక్స్ ఢిల్లీకి చేరాయి.
దిశ, డైనమిక్ బ్యూరో/తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయం ఢిల్లీకి చేరింది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల పంపకాలు, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, జీవన్‌రెడ్డి వ్యవహారం టీ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై గత మూడురోజులుగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, జానారెడ్డి వంటి పెద్దలు ఢిల్లీలోనే మకాం వేసి ఏఐసీసీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మరికాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ఢిల్లీకి ప్రయాణం కాబోతుండటం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ముఖ్యనేతలంతా ఢిల్లీకి క్యూ కట్టడంతో కాంగ్రెస్‌లో పదవులు ఆశిస్తున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
జీవన్‌రెడ్డికి దీపా దాస్‌మున్షీ ఫోన్..
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేరికతో మనసు నొచ్చుకున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారనే సంగతి తెలియగానే ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ సహా పలువురు నేతలు ఆయన నివాసానికి వెళ్లి బుజ్జగించారు. అయినా జీవన్‌రెడ్డి బెట్టు వీడకపోవడంతో అధిష్టానమే స్వయంగా రంగంలోకి దిగింది. ఈ మేరకు ఇవాళ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపా దాస్‌మున్షీ స్వయంగా ఆయనకు ఫోన్ చేసి ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయనను తీసుకువచ్చే బాధ్యతను అధిష్టానం అడ్లూరి లక్ష్మణ్‌కు అప్పగించింది. అధిష్టానం ఆయనకు ఏ విధంగా నచ్చజెప్పనుంది? ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా? అనేది ఆసక్తిగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో జీవన్‌రెడ్డికి మంత్రిపదవి ఖాయం అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
పార్టీ సంస్థాగత బలోపేతంపై ఫోకస్..
లోక్‌సభ ఎన్నికలు పూర్తి కావడంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు పార్టీని మరింత స్ట్రెంథెన్ చేయడం కోసం రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణపై ఇవాళ రాష్ట్ర నేతలతో ఏఐసీసీ కీలక భేటీ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. 37 మంది నేతల నామినేటెడ్ పదవులపై ఇవాళ క్లారిటీ వస్తుందని, ఒకటి రెండ్రోజుల్లోగా వీటికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ ఓ వైపు కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అవుతూ రాష్టానికి సంబంధించిన సమస్యలు, నిధుల కోసం విజ్ఞప్తులు చేస్తూనే.. మరోవైపు పార్టీ వ్యవహారాల విషయంలో అధిష్టానంతో చర్చలు కొనసాగిస్తున్నారు.
చేరికలపై కీలక చర్చలు..
నిన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా పార్టీలో చేరికలపై డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరికొంతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా చేరికలపై రాష్ట్ర నాయకత్వం అధిష్టానం వద్ద చర్చించి ఓ నిర్ణయం తీసుకోబుతున్నట్లు తెలుస్తోంది. చేరికల విషయంలో కేసీఆర్ లీగల్ ఫైట్‌కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో ఏఐసీసీ నిర్ణయం సర్వత్ర ఉత్కంఠ రేపుతున్నది.