T Congress:కేటీఆర్, హరీష్ రావు మీ సోషల్ మీడియాను అదుపులో పెట్టుకోండి.. తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్
బీఆర్ఎస్ నాయకులు మీ సోషల్ మీడియాను అదుపులో పెట్టుకోవాలని, మాటలు మేం కూడా అనగలం కానీ మాకు సంస్కారం అడ్డొస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నాయకులు మీ సోషల్ మీడియాను అదుపులో పెట్టుకోవాలని, మాటలు మేం కూడా అనగలం కానీ మాకు సంస్కారం అడ్డొస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. "అన్నీ మేమే చేస్తే నువ్వు ఏం పీకుతావ్ రేవంతూ!?" అని బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో తెలంగాణ కాంగ్రెస్ .. కేటీఆర్, హరీష్ రావులు తమ సోషల్ మీడియాను అదుపులో ఉంచుకోవాలని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. "కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం పీకాడు!? అధికారం ఉన్నపుడు పీకింది ఏం లేదు, కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్ పెద్దగా పీకేదేం లేదు!?" అని మేము కూడా అనగమని, కానీ మాకు సంస్కారం అడ్డు వస్తుందని చెప్పారు.
మా పార్టీ విలువలను కాపాడుతూ, ప్రజాస్వామ్య బద్ధంగా విమర్శలు చేస్తున్నామని తెలిపారు. మీరు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వెనుక మీ పార్టీ విధానాలు, మీ నాయకత్వం, మీ ఆలోచనలు ఎలాంటివో అర్థం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ అధికారిక ఖాతాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసహరించుకోవాలని ఎక్స్ ద్వారా డిమాండ్ చేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీ.. రెండు క్రితం వరద బాధితుల సహాయార్ధం ప్రతిపక్షాలు కూడా ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ "అన్నీ మేమే చేస్తే నువ్వు ఏం పీకుతావ్ రేవంతూ!?" అని రాసుకొచ్చింది.