త్వరలో రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ నాయకత్వం నుంచి సంకేతాలు అందినట్లు సమాచారం. కట్టర్ హిందువుగా ముద్ర పడిన రాజాసింగ్ ను దూరం చేసుకోవద్దనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ఫారూఖీపై వ్యాఖ్యలే కారణం..
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమం రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కారణమైంది. ఫారుఖీ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అయినా భారీ భద్రత నడుమ షో ను నిర్వహించారు. దీంతో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు ఆగస్టు 25న పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. ఈ వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సస్పెండ్ చేసింది. మునుగోడు ఉప ఎన్నికలకు ముందే సస్పెన్షన్ ఎత్తివేయాలని భావించినప్పటికీ సాధ్యపడలేదు.
కాగా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధిష్టానానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత అంశంపై మాత్రం తనకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పడం గమనార్హం. బీజేపీలో ఒక వర్గం మాత్రం త్వరలోనే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతుండగా, రాజాసింగ్ వ్యాఖ్యలతో సస్పెన్షన్ ఎత్తివేతకు ఇంకాస్త టైం పట్టే అవకాశముందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.