పొంగులేటి-జూపల్లి-ఈటల చర్చలపై సస్పెన్స్!

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మధ్య జరిగిన చర్చల్లో ఫైనల్ నిర్ణయం ఏం జరిగిందనేది గోప్యంగానే ఉండిపోయింది.

Update: 2023-05-26 02:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మధ్య జరిగిన చర్చల్లో ఫైనల్ నిర్ణయం ఏం జరిగిందనేది గోప్యంగానే ఉండిపోయింది. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని ఓ ఫామ్ హౌజ్‌లో ఈ ముగ్గురూ రహస్యంగా భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ముగ్గురి ఉమ్మడి శత్రువైన బీఆర్ఎస్‌ను రానున్న ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా ఈ భేటీలో చర్చలు జరిగాయి. బీఆర్ఎస్‌ను ఢీకొట్టడానికి బీజేపీ దగ్గరున్న వ్యూహంపైనా, శక్తి సామర్థ్యాలపైనా ఈటల రాజేందర్ ఇచ్చిన వివరణతో పొంగులేటి, జూపల్లి సంతృప్తి చెందలేదంటూవార్తలు వస్తున్నా దీనిపై పై ముగ్గురూ స్పందించలేదు.

ఈ చర్చల తర్వాత ఆ ఇద్దరూ బీజేపీ గూటికి చేరుతున్నారా? లేక ప్రత్యామ్నాయ ఆలోచన వర్కవుట్ అయిందా అనేదానిపై స్పష్టత లేదు. రానున్న రోజుల్లో సరికొత్త వేదిక రూపుదిద్దుకుంటుందా అనే వాదనలూ తెరమీదకు వస్తున్నాయి. బీఆర్ఎస్‌ను ఓడించడానికి బీజేపీ దగ్గరున్న ప్లాన్‌పై ఎక్కువసేపు చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలం, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, ఎన్ని సీట్లలో గెలుపు సాధ్యం, ఓటు బ్యాంకుపై చూపే ప్రభావం.. తదితర అనేక అంశాలపై వారి మధ్య లోతుగానే చర్చలు జరిగినట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో సమన్వయం, కేంద్ర నాయకత్వం భరోసా తదితరాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

బీజేపీ వ్యూహాలపై ఈటల రాజేందర్ వెల్లడించిన అంశాలపై పొంగులేటి, జూపల్లి పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని, అందువల్ల స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించలేదని తెలిసింది. ఈ మీటింగ్ తర్వాత పై ముగ్గురూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. సమావేశం అసంపూర్ణంగా ముగిసిపోయింది. ఇద్దరినీ బీజేపీలోకి లాగడానికి ఈటల ప్రయత్నిస్తున్నారనేది బహిర్గతమైనా దానికంటే భిన్నంగా ఈటల ఇంకేమైనా కామెంట్లు చేశారా అనే అనుమానం నెలకొన్నది. గన్‌మెన్‌ను సైతం వదిలేసి రహస్యంగా ఈటల వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలకు సమాధానం కరువైంది.

వీరిద్దరినీ బీజేపీలోకి ఆహ్వానించడంపై చాలాకాలంగా చర్చ జరుగుతున్నదని, చేరికల కమిటీ చైర్మన్‌గా వారిని పార్టీలోకి లాగడానికి ఈటలకు పూర్తి స్వేచ్ఛ ఉన్నదని, దాన్ని రహస్యంగా చర్చించాల్సిన అవసరమే లేదని, అయినా గన్‌మెన్‌ను సైతం వదిలేసి వెళ్ళాల్సిన అవసరమేముందని.. ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇటీవల ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కొన్ని వ్యూహం మార్చుకోవాల్సిన అవసరాన్ని సైతం కేంద్ర నాయకత్వం దగ్గర ప్రస్తావించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత స్వయంగా ఈటల ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని, బండి సంజయ్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు ఓపెన్‌గానే చెప్పారు.

అయినా ఈటలపై పార్టీ శ్రేణుల్లోనే అనుమానాలు నెలకొనడంతో పొంగులేటి, జూపల్లితో జరిగిన చర్చల్లో వారిని బీజేపీకి ఆహ్వానించడంపై చర్చించారా.. లేక బీజేపీలోకి రావడంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో పరోక్షంగా ప్రయోజనం కలిగించే ఆల్టర్నేట్ ప్రయత్నాలపై చర్చించారా?.. లేక బీజేపీలో ఇమడలేకపోతున్న ఈటలే ప్రత్యామ్నాయ వేదికలోకి వెళ్ళడం గురించి మాట్లాడుకున్నారా?.. ఇలాంటి సందేహాలన్నీ చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఫైనల్ నిర్ణయం వారి నుంచి వెలువడకపోవడంతో అవన్నీ అనుమానాలుగానే మిగిలిపోయాయి. రానున్న రోజుల్లో ఈ చర్చల సారాంశం ఏదో ఒక రూపంలో వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News