సాంఘీక చైతన్యానికి నిలువెత్తు స్ఫూర్తి సురవరం
సాంఘిక చైతన్యానికి నిలువెత్తు స్ఫూర్తి సురవరం సుధాకర్ రెడ్డి అని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : సాంఘిక చైతన్యానికి నిలువెత్తు స్ఫూర్తి సురవరం సుధాకర్ రెడ్డి అని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం ట్యాంక్ బండ్ పైన ఉన్న సురవరం సుధాకర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భాష, సాహిత్యము, సాంస్కృతిక పునరుజ్జీవనం, ప్రాంత అభివృద్ధి కోసం సురవరం ప్రతాపరెడ్డి కృషి ఎనలేనిదన్నారు. భూగర్భం నుంచి అంతరిక్షం వరకు.. సాహిత్యం నుంచి సైన్స్ వరకు సురవరం స్పృశించని అంశం లేదని అన్నారు. తెలంగాణ చైతన్యానికి ఆయన గొప్ప స్ఫూర్తి.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగువ్యక్తి. సురవరం సాహిత్యం ఒక మాటలో, ఒక ఉపన్యాసంలో వర్ణించలేమన్నారు.
ఏకకాలంలో దళిత సంఘాలకు, వైశ్య సంఘాలు.. భిన్నమైన సామాజిక వర్గాలకు గౌరవ అధ్యక్షులుగా పని చేశారని తెలిపారు. తొలిసారి వనపర్తి శాసనసభ్యులుగా ఎన్నికై కేవలం 12,13 మాసాలలోనే మరణించడం దురదృష్టకరమఅన్నారు. సురవరం జీవిత చరిత్ర మూడో తరానికి తెలియాలని.. ఆయన కీర్తి పతాక చిరస్థాయిగా వెలగాలనే ఆకాంక్షతో ఆయన విగ్రహాన్ని వనపర్తిలో ఆవిష్కరించాం అన్నారు. ఆయన చేసిన సేవలు మరింత ప్రాచుర్యంలోకి రావాల్సిన అవసరం ఉందని,ఆయన రచనలను రెండు సంపుటాలుగా తీసుకొచ్చాం.. మూడో సంపుటాన్ని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తీసుకొస్తామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు, వనపర్తి నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు ఇప్పటికీ గుర్తుండిపోతాయన్నారు.