గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లులు.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్ పెండింగ్ పెట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.

Update: 2023-03-20 11:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్ పెండింగ్ పెట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గవర్నర్‌కు నోటీసులు జారీ చేయాలని తొలుత భావించింది. గవర్నర్ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌కు నోటీసులు జారీ చేస్తే అది తప్పుడు సందేశమే అవుతుందని, ఇదొక సంప్రదాయంగా మారుతుందని పేర్కొన్నారు. గవర్నర్ పదవిలో ఉన్నవారికి నోటీసులు ఇవ్వడం సరికాదని, పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రానికి నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని సీజే బెంచ్ బదులిచ్చింది.

గవర్నర్ తరపున ఆయన వాదిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఈ పిటిషన్‌లో పది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపలేదని, ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నదని, కానీ ఇందులో కొన్ని బిల్లులు ఇటీవలే రాజ్‌భవన్‌కు చేరుకున్నాయని వివరించారు. పూర్తి వివరాలను తాను తెలంగాణ రాజ్‌భవన్‌ నుంచి తెలుసుకోవాల్సి ఉన్నదని, దీనికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఏయే బిల్లులు ఎందుకు పరిశీలనలో ఉన్నాయో, ఆమోదం పొందకుండా ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో వివరాలను తీసుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. దీనికి స్పందించిన సీజే ధర్మాసనం.. అన్ని వివరాలను తెప్పించుకుని సుప్రీంకోర్టుకు తెలియజేయాలని సొలిసిటర్ జనరల్‌కు సూచించింది. తదుపరి విచారణను మార్చి 27కు వాయిదా వేసింది.

Tags:    

Similar News