వ్యూహకర్తగా సునీల్​ కనుగోలు.. రాష్ట్ర నేతలతో ఇంట్రాక్ట్​

దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు కాంగ్రెస్​ నేతలు ఢిల్లీ బాటపట్టారు. దాదాపు ఏడాదిగా సాగుతున్న కల్లోలానికి తెర పడుతుందా..? అనే

Update: 2022-04-03 23:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు కాంగ్రెస్​ నేతలు ఢిల్లీ బాటపట్టారు. దాదాపు ఏడాదిగా సాగుతున్న కల్లోలానికి తెర పడుతుందా..? అనేది ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. రేవంత్​రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నింటినీ పరిశీలించిన ఏఐసీసీ.. సోమవారం కీలక సమావేశం నిర్వహిస్తోంది. రాష్ట్రానికి చెందిన దాదాపు 35 మంది నేతలను ఢిల్లీకి పిలిచారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్​కు వ్యూహకర్తను ఖరారు చేసినట్లు కాంగ్రెస్​ నేతలకు స్పష్టత ఇచ్చారు. ఢిల్లీలో సోమవారం రాష్ట్ర నేతలతో జరిగే సమావేశంలో వ్యూహకర్త సునీల్​ కనుగోలుతో పాటుగా మరొకరిని పరిచయం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు సమాచారమందించారు.

కొంతైనా తగ్గుతారా?

" రాష్ట్రంలో అనుకూల పవనాలు వస్తున్నా.. వాటిని అందుకోవడంలో కాంగ్రెస్​ పార్టీ విఫలమవుతోంది." ఇప్పటి వరకు కిందిస్థాయి నేతల నుంచి రాజకీయ విశ్లేషకులు పదేపదే చెప్పే మాటే ఇది. మొన్నటిదాకా టీపీసీసీ చీఫ్​ను మార్చాలంటూ పట్టుబట్టిన నేతలు రేవంత్​ రెడ్డికి పగ్గాలు ఇవ్వడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. రేవంత్​తో కలుస్తున్నట్లే ఉంటున్నా.. సందర్భాన్ని బట్టి విమర్శలకు దిగుతున్నారు. దీంతో సొంత నేతలను సమన్వయం చేసుకోవడంలోనే పార్టీ నేతలు నిమగ్నమయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి తోడుగా టీపీసీసీ ఎలాంటి నిరసన కార్యక్రమాలు తీసుకున్నా దానికి సొంత పార్టీలోనే బహిరంగ విమర్శలు ఎక్కువయ్యాయి. ఫలితంగా అటు అధికారపక్షం, ఇటు బీజేపీకి అనుకూలంగా మారుతోంది. అంతేకాకుండా పార్టీలో కేసీఆర్​ కోవర్టులున్నారనే ముద్ర చెరిగిపోవడం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనను పదేపదే కోవర్టు అంటున్నారంటూ బహిరంగ విమర్శలు చేయడమే కాకుండా రాజీనామాకు సైతం సిద్ధమయ్యారు. జగ్గారెడ్డి అంశం కొనసాగుతుండగానే.. కాంగ్రెస్​ లాయలిస్టుల ఫోరం అంటూ వీహెచ్​ ఆధ్వర్యంలో మరో వ్యతిరేక కూటమి తెరపైకి వచ్చింది. ఈ అంశాలన్నింటిపైనా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్​ కీలక నివేదికను ఏఐసీసీకి ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో టాక్​. అయితే, ఇటీవల రేవంత్​రెడ్డికి రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే వెసలుబాటు కల్పించినట్లు ఢిల్లీ నుంచే సంకేతాలిచ్చారు. కానీ, ఆ తర్వాత రాహుల్​ గాంధీతో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్​కుమార్​ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలను రాహుల్​కు వివరించే ప్రయత్నం చేయడంతో.. రాష్ట్ర నేతలతో సమావేశం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సోమవారం రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహిస్తున్నామంటూ ఏఐసీసీ సమాచారమిచ్చింది. దాదాపుగా 35 మంది నేతలకు ఆహ్వానం పంపించారు. దీంతో రాష్ట్ర నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డితో పాటుగా వర్కింగ్​ ప్రెసిడెంట్లు, ఎంపీలు, సీనియర్​ ఉపాధ్యక్షులు, పీఏసీ కమిటీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరారు.

రాహుల్​ మీటింగ్​ తర్వాత నాయకుల్లో ఎలాంటి మార్పు వస్తుందోనని పార్టీ నేతల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. గతంలోనూ ఇలా అసంతృప్తి వ్యక్తం చేసే నేతలకు వార్నింగ్​లు పంపిన విషయం తెలిసిందే. అయినా విమర్శలు ఆగలేదు. ఇప్పుడు వారితో నేరుగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని కొంతమంది నుంచి అభిప్రాయాలు వినే అవకాశం ఉంది. అయితే, అల్రెడీ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్​ ఒక నివేదికను ఏఐసీసీకి ఇవ్వడంతో అసంతృప్తి నేతల వాయిస్​ను ఎంత మేరకు పరిగణలోకి తీసుకుంటారనేదే ప్రశ్నార్థకం.

ఆయనే వ్యూహకర్త

రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ వ్యూహకర్తగా సునీల్​ కనుగోలుతో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర నేతలకు నేడు ఆయనను పరిచయం చేస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై కొంతమంది నేతలకు స్పష్టతనిచ్చినట్లు చెప్పుతున్నారు. మన రాష్ట్రంతో పాటుగా కర్ణాటకకు కూడా సునీల్​ కనుగోలును వ్యూహకర్తగా కాంగ్రెస్​ అధిష్టానం నియమించినట్లు సమాచారం. కొద్దిరోజుల కిందటే దీనిపై ఒప్పందం కూడా కుదిరిందంటున్నారు. ఒకప్పుడు కలిసి పని చేసిన ప్రశాంత్​కిషోర్​, సునీల్​ కనుగోలు.. వీడిపోయిన తర్వాత ఎవరికి వారే పలుపార్టీలకు వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అయితే బహిరంగ ప్రచారానికి సునీల్​ దూరంగా ఉంటారని తెలుస్తోంది. కాగా, రాష్ట్రానికి ఆయన్నే వ్యూహకర్తగా ఏఐసీసీ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం పార్టీ నేతలందరికీ సునీల్​తో పాటుగా ఆయన బృందంలోని మరో కీలక వ్యక్తిని కూడా రాహుల్​ గాంధీ నేరుగా పరిచయం చేయనున్నట్లు ఏఐసీసీ నేతలు వెల్లడించారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రంలో తొలి సర్వే చేయనున్నట్లు చెప్పుతున్నారు.

Tags:    

Similar News