భానుడి భగభగలు.. అప్పుడే రెండు డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల మేర పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి కన్నా మార్చిలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల మేర పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి కన్నా మార్చిలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు సగటు కన్నా ఎక్కువగా నమోదు కావొచ్చని ఐఎండీ అంచనా వేసింది. గడిచిన మూడు నాలుగేళ్లుగా మార్చి నెల రాకముందే ఎండలు ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలలో కాస్త చల్లబడినా మధ్యాహ్నం ముఖం మాడిపోయేలా ఎండలు కాస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి నుంచే ఎండలు తన ఉగ్రరూపాన్ని చూపడంతో జనం అడుగు బయటపెట్టాలంటే కాస్త జంకుతున్నారు.
ఇప్పటి నుంచే కూలర్లు
ఫిబ్రవరిలో మాదిరి.. మార్చి 5 వరకూ కాస్త పొగమంచు, ఆకాశం మేఘావృతమై కనిపించినా ఆ తర్వాత మాత్రం ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలను తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 23 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఉక్కపోత విపరీతంగా ఉండే అవకాశాలు లేకపోలేదని పేర్కొంది. ఎండలు మండిపోతుండటంతో ఇప్పటి నుంచే ఏసీలు, కూలర్ల వినియోగం పెరుగుతోంది. ఎండల నుంచి రక్షణకు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.