సచివాలయంలో సుదర్శన యాగం.. మీడియాపై ఆంక్షలు
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం సుదర్శన యాగం, చండీహోమంతో మొదలైంది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం సుదర్శన యాగం, చండీహోమంతో మొదలైంది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంప్రదాయ పూజా కార్యక్రమాలకు పలువురు పార్టీ నేతలు, అధికారులు, మంత్రులు హాజరయ్యారు. ఉదయం ఆరుంబావుకే మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు యాగంలో పాల్గొన్నారు. వంద మందికి పైగా రుత్విక్కులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సచివాలయం ప్రాంగణంలోనే ఏర్పాటుచేసిన యాగశాలలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచారులు, సచివాలయ ఉద్యోగ సంఘం నాయకులు హాజరయ్యారు. సచివాలయం నిర్మాణ బాధ్యతలను రోడ్లు భవనాల శాఖ మంత్రిగా వేముల ప్రశాంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి అప్పజెప్పడంతో ఇప్పుడు సుదర్శన యాగంలోనూ ఆయనకే అవకాశం కల్పించారు.
మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో యాగం, హోమం పూర్తయింది. అనంతరం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంటనే ప్రధాన ద్వారం దగ్గర శిలా ఫలకాన్ని ఆవిష్కరించి గ్రౌండ్ ఫ్లోర్‌లో జరిగిన వాస్తు పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆరో అంతస్తులోని ఛాంబర్‌కు వెళ్ళి వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ కుర్చీలో కూర్చుని ఫైలుపై సంతకం చేశారు. మంత్రుల ఛాంబర్లలోనూ విడివిడిగా పూజలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలు జరిగాయి. అందరూ వారి శాఖలకు సంబంధించిన ఫైళ్ళపై సంతకాలు చేశారు.
మీడియా అనుమతిపై ఆంక్షలు
మొదటి నుంచీ అనుమానిస్తున్నట్లుగానే మీడియాపైన ఆంక్షలు అమలయ్యాయి. కొన్ని ఎంపిక చేసిన పత్రికలు, టీవీ ఛానెళ్ళకు మాత్రమే రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఎంట్రీ పాసులను జారీచేసింది. అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పుకునేలా భారీ స్థాయిలో వాణిజ్య ప్రకటనలను కూడా మీడియా సంస్థలకు ఇచ్చింది. కానీ కవరేజి విషయంలో మాత్రం పరిమిత సంఖ్యలోనే పాసులను అందజేయడంతో జర్నలిస్టుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈస్ట్ వైపు ఎంట్రీ గేట్ వరకే మీడియాకు అనుమతి లభించింది.
బీబీసీ విషయంలో మోడీపై అలా..
బీబీసీ మీడియా సంస్థపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ సంస్థపై ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం వేధింపు చర్యలకు పాల్పడుతున్నదని, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని గతంలో ప్రధాని మోడీపైన విమర్శలు చేశారు. మీడియా స్వేచ్ఛ విషయంలో కేంద్రం వివక్షాపూరితంగా, ఏకపక్ష విధానాలను ప్రదర్శిస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ట్ర సచివాలయం విషయంలో మీడియా సంస్థలకు ఎంట్రీ పాస్‌ల జారీ విషయంలో కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరించడంలేదనే కామెంట్ జర్నలిస్టుల నుంచి ఓపెన్‌గానే వ్యక్తమవుతున్నది. మోడీని విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు స్వయంగా ఆయన కూడా అదే పని చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.