రెవెన్యూ, మున్సిపల్ చట్టాల అధ్యయనం.. నేడు చట్ట సవరణపై కేబినేట్‌లో చర్చ

ప్రభుత్వం భూములు, జల వనరుల సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుంది.

Update: 2024-09-20 06:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం భూములు, జల వనరుల సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా ముందుకెళ్తోంది. అందుకే హైడ్రా దూకుడు మరింతగా పెరిగింది. అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్/బఫర్ జోన్లలో నిర్మాణాల కూల్చివేతలో లీగల్ చిక్కులు రాకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నేటి సాయంత్రం కేబినేట్‌లో భూములను కాపాడేందుకు సర్వాధికారాలను హైడ్రాకు కట్టబెట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించడంపై చర్చించనున్నారు. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పంచాయత్ రాజ్ శాఖలకు సంబంధించిన చట్టాలను కూడా సవరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కూల్చివేతలపై హైడ్రాకు చట్టబద్ధత లేదన్న ప్రశ్నలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి దాకా హైడ్రాకు నోటీసులు జారీ చేసే అధికారం కూడా లేదు. అలాంటి సందేహాలకు, చట్టపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఈ చట్టాల సవరణ

తెలంగాణ రెవెన్యూ యాక్ట్, తెలంగాణ భూ ఆక్రమణ చట్టం, 1908 సెక్షన్ 6, 7, 8 సెక్షన్లు, తెలంగాణ పురపాలక చట్టం 2019, హెచ్ఎండీఏ చట్టం 2008లోని హెచ్ఎండీ కమిషనర్‌కి ఉన్న అధికారాలను హైడ్రాకు అప్పగించనున్నారు. హైడ్రా చేపట్టిన కార్యక్రమాలకు ఈ చట్టాలు అడ్డుగా మారాయి. అందుకే వీటిని సవరించేందుకు చర్యలు తీసుకున్నారు.

ఏం మార్పు?

ది తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్ యాక్ట్, 1905 సెక్షన్ 6, 7, 8లో సవరణలు చేస్తున్నారు.

సెక్షన్ 6: ఎవరైనా భూమిని అన్యాక్రాంతం చేస్తే కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ లేదా డిప్యూటీ తహశీల్దార్ యాక్షన్ తీసుకోవచ్చు. ముందుగా నోటీసులు జారీ చేస్తారు. పంటలు వేసినా, ఏవైనా నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఎంక్వయిరీ చేసి వాస్తవాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత ముందుగా నోటీసులు జారీ చేస్తారు. 30 రోజుల గడువు తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే వారంట్ ఇష్యూ చేసి జైలుకు పంపే అధికారం ఉంటుంది. ఆరు నెలల జైలు శిక్ష, రూ.1000 జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది.

సెక్షన్ 7: నోటీసులు జారీ చేసినా ల్యాండ్ ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుంటే ది తెలంగాణ రెవెన్యూ రికవరీ యాక్ట్, 1864 ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. అలాగే కొంత మంది సమూహం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్లు గుర్తిస్తే జిల్లా కలెక్టర్ ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే చర్యలు తీసుకోవచ్చు. ఆ ల్యాండ్ ని ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుంటారు. పోలీసుల సహకారంతో ఈ యాక్షన్ తీసుకుంటారు.

సెక్షన్ 8: భూములు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. రెంట్, ఫీజుల విషయంలో అంచనాలను రెగ్యులేట్ చేస్తుంది. అలాగే అన్యాక్రాంతం చేస్తుంటే పెనాల్టీలను కూడా పెంచొచ్చు. ఎవరూ కబ్జా చేయకుండా చర్యలు చేపడుతుంది. నోటీసుల జారీ విషయంలోనూ మార్పులు చేస్తుంది.

ఈ బాధ్యతలను హైడ్రాకు అప్పగించనున్నారు. ఐతే అప్పీల్ వ్యవస్థపైనే సందేహాలు ఉన్నాయి. ఇప్పటి దాకా కలెక్టర్‌కు అప్పీల్ చేసుకునే వీలుంది. హైడ్రా రాష్ట్ర స్థాయి సంస్థగా ఉంటే అప్పీల్ వ్యవస్థ ఏ స్థాయిలో ఏర్పాటవుతుందో వేచి చూడాలి.


Similar News