అటవీ అధికారులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు : మంత్రి సురేఖ
అటవీ చట్టాలను అతిక్రమించి, అటవీ అధికారుల పై దాడికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : అటవీ చట్టాలను అతిక్రమించి, అటవీ అధికారుల పై దాడికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న అటవీ అధికారులు వినోద్, శరత చంద్రలతో శుక్రవారం మంత్రి ఫోన్లో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. వారికి మంచి వైద్యం అందేలా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అటవీ సంపద పరిరక్షణే ధ్యేయంగా సైనికుల్లా పోరాడుతున్న అటవీ అధికారులు, సిబ్బందిపై దాడులు చేస్తే ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. అటవీ సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అటవీ అధికారులపై జరుగుతున్న దాడులు, వారు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి దామరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను తొలగించి, నేలను చదును చేస్తున్నారనే సమాచారంతో అధికారులు అక్కడికి వెళ్ళి జేసీబీని స్వాధీనం చేసుకొని, అటవీ కార్యాలయానికి తరలించారు. దీంతో నిందితులు కార్యాలయానికి వచ్చి అటవీ అధికారులపై విచక్షణారహితంగా దాడి చేసి లైట్లను, జీపును ధ్వంసం చేసి జేసీబీని తీసుకుని పోయారని పీసీసీఎఫ్ డోబ్రియాల్ మంత్రికి వివరించారు.