MLA Kavampalli: కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ గురుకుల బాట : కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి ధ్వజం
గురుకుల పాఠశాల(Gurukul School)ల్లో సమస్యలు సృష్టించిన బీఆర్ఎస్ తన కుట్రలో భాగంగానే గురుకుల బాట పేరుతో ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavampalli Satyanarayana)ఆరోపించారు.
దిశ, వెడ్ డెస్క్ : గురుకుల పాఠశాల(Gurukul School)ల్లో సమస్యలు సృష్టించిన బీఆర్ఎస్ తన కుట్రలో భాగంగానే గురుకుల బాట పేరుతో ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavampalli Satyanarayana)ఆరోపించారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో గురుకుల బాట చేస్తామని బీఆర్ఎస్ చెబుతుందని ఏ ముఖం పెట్టుకుని ఆర్ఎస్పీ గురుకులాలకు వెలుతారని కవ్వంపల్లి ప్రశ్నించారు. గురుకులాల సెక్రటరీగా ఆర్ఎస్పీ ఎనిమిదేండ్ల కాలంలో కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయన్న సంగతి మరువరాదన్నారు. గురుకులాలకు సొంత భవనాలు కట్టకుండా, తన అనునయుల భవనాల్లో గురుకులాలను అద్దె తీసుకున్నాడని, పెద్ద ఎత్తున గురుకులాల్లో ఆర్ఎస్పీ అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయన్నారు. ఆర్ఎస్పీ గత ప్రభుత్వ కాలంలో ఏనాడు కూడా డైట్ చార్జీలు పెంచాలని అడుగలేదని, గురుకుల వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని ఆర్ఎస్పీ చెలరేగిపోయాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల డైట్ చార్జీలను పెంచి, ఒక్కో సమస్యను పరిష్కరించే క్రమంలో గురుకులాల బాట పేరుతో రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు.
అటు కాంగ్రెస్ నాయకురాలు బండ్రు శోభారాణి సైతం గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ కుట్ర ఉందని ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ కనుసన్నలలోనే హాస్టళ్లలో కుట్రలు జరుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్పీ తన స్వేరో నెట్ వర్క్ తో గురుకులాల్లో సమస్యలను సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర దర్యాప్తు జరిపించి నిజాలు బహిర్గతం చేయాలని కోరారు. లేకుంటే అమాయక విద్యార్థులు వారి కుట్రలకు బలయ్యే ప్రమాదముందన్నారు.