ఇంకా అధికార మత్తులోనే! KTR వ్యవహారశైలిపై సొంత పార్టీ నేతల అసహనం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి కొందరు బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరును ఆపార్టీ లీడర్లే తప్పు పడుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి కొందరు బీఆర్ఎస్ లీడర్లు వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ లీడర్లే తప్పు పడుతున్నారు. ఓడిపోయినా తమ లీడర్లకు అహంకారం మాత్రం తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు. వారి మాటల్లో, వ్యవహార శైలిలో ఓడిపోయానే ఫీలింగ్ లేదని విమర్శిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు, అసెంబ్లీలో మాట్లాడిన తీరు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నదని గుర్తు చేస్తున్నారు. అధికార మత్తు నుంచి బయటికి వచ్చి, ప్రతిపక్ష పాత్రలో సమర్థవంతంగా పనిచేస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, లేకపోతే పార్టీ మనగడ కష్టమని సూచిస్తున్నారు.
కేటీఆర్ తీరుపైనే విమర్శలు
ఎన్నికలకు ముందు నుంచే మాజీ మంత్రి కేటీఆర్ తీరును బీఆర్ఎస్ లీడర్లు తమ అంతర్గత సమావేశాల్లో తప్పుపట్టేవారనే చర్చ ఉన్నది. ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లను కలిసేందుకు చొరవ చూపరని, కలిసినా పట్టించుకోరని విమర్శలు ఉన్నాయి. అయితే అధికారం పోయిన తరువాత కేటీఆర్ తీరులో మార్పు వస్తుందని ఆశపడ్డ లీడర్లకు నిరాశ ఎదురవుతున్నదనే కామెంట్స్ వస్తున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్పప్పుడు అణకువగా ఉంటూ, ఎదురైన ప్రతి ఒక్కరిని పలకరించాలనే విషయాన్ని మరిచిపోయి, ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుగా వ్యవహరిస్తున్నారనే టాక్ పార్టీలో ఉంది. అసెంబ్లీ లోపలికి, బయటికి వెళ్తున్న సమయంలో మంత్రి అనే తీరుగానే ప్రవర్తిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. కేటీఆర్ తన చుట్టూ ఓ పదిమంది లీడర్లను వెంటేసుకుని వెళ్లడం వల్ల సాధారణ కార్యకర్తలను కలిసే అవకాశం లేకుండా పోతున్నదని ఓ మాజీ మంత్రి కామెంట్ చేశారు.
గవర్నర్ స్పీచ్‌పై కూడా..
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల అమలుపై ఓ ఆరు నెలల తరువాత విమర్శలు చేస్తే బాగుటుందని, కానీ మంత్రి కేటీఆర్ అప్పుడే విమర్శలు చేయడం వల్ల అభాసుపాలవుతున్నట్లు బీఆర్ఎస్ లీడర్లలో చర్చ జరుగుతున్నది. ఈనెల 13న అసెంబ్లీలో కేటీఆర్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. కాంగ్రెస్ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని, అసలు కథ ఇప్పుడు ఉంటుందని కామెంట్ చేశారు. అలాగే అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతున్న సమయంలో కేటీఆర్ హావాభావాలు అధికారంలో ఉన్నామనే తీరుగా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆయన ప్రసంగంలో ఎక్కువ భాగం మంత్రిగా సమాధానం చెబుతున్నట్టుగానే, ప్రతిపక్షాన్ని ఎదురుదాడి చేసే విధంగా ఉందనే విమర్శలు వచ్చాయి. అయితే ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం లేనప్పుడు.. మీడియా పాయింట్‌కు వచ్చి, పార్టీ వైఖరిని వివరించే అవకాశముంటుంది. కానీ కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో కూర్చొని ఉండిపోవడం సరికాదనే కామెంట్స్ వచ్చాయి.
అదే దారిలో ఇతర లీడర్లు..
ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుగా కొందరు మాజీ మంత్రులు సైతం వ్యవహరిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. జిల్లాల్లో పార్టీ లీడర్లు, కార్యకర్తలు కలిసేందుకు వచ్చే సమయంలో సదరు మాజీ మంత్రుల తీరు సరిగా లేదనే టాక్ ఉంది. గంటల కొద్దీ వెయిట్ చేయిస్తున్నారని, కలిసినా పొడిపొడిగా మాట్లాడి పంపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య అసెంబ్లీలోకి వచ్చిన సదరు మాజీ మంత్రుల బిహేవియర్ కూడా అదే తీరుగా ఉందని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్ చేశారు.