ట్విట్టర్‌ ద్వారా పోరుకు శ్రీకారం.. మేడిగడ్డ బాధితుల కొత్త పంథా

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజ్ బాధితులు ట్విట్టర్‌ ద్వారా పోరుకు శ్రీకారం చుట్టారు.

Update: 2022-10-29 03:06 GMT

దిశ, కరీంనగర్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజ్ బాధితులు ట్విట్టర్‌ ద్వారా పోరుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రుల నుంచి స్పందన రావడం కోసం కొత్త పంథాను ఎంచుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఇప్పటికే ఎన్నో రకాలుగా మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన రైతులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నారు. తాజాగా పోస్టు కార్డుల ఉద్యమంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు లేఖలు రాశారు. స్పందన రాకపోవడంతో ట్విట్టర్ వేదికగా తమ సమస్యను మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలకు తెలిపేందుకు ట్యాగ్ చేయడం మొదలు పెట్టారు. గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాకు చెందిన 12 గ్రామాల రైతులు మేడిగడ్డ బ్యారేజ్ కారణంగా వ్యవసాయం చేసుకోలేని దుర్భర పరిస్థితికి చేరుకున్నామని తమకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మొదట నోటిఫై చేసిన భూములు ఎకరాకు రూ. 10.50 లక్షలు ఇచ్చారన్నారు. అయితే అప్పుడు నోటిఫై చేసిన మొత్తం భూమికి పరిహారం ఇవ్వలేదన్నారు. ఆ భూములకు అదనంగా మరో 500 నుండి 800 ఎకరాల వరకూ భూమి మేడిగడ్డ బ్యాక్ వాటర్‌లో మునిగిపోతోందని సిరొంచ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుండి తాము సాగు చేసుకోలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఎన్నో సార్లు వేడుకున్నా పట్టించుకునే వారు లేరని సిరొంచ తాలుకా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్ వల్ల అదనపు భూములు కూడా ముంపునకు గురవుతున్నాయని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. గతంలో నోటిఫై చేసిన భూములకు పరిహారం ఇవ్వలేదని అక్కడి రైతులు మార్కెట్ ధర ప్రకారం డబ్బులు అడుగుతున్నారని లేఖలో తెలిపారన్నారు. అయితే ఈ లేఖకు తెలంగాణ ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో ఆందోళనను యథావిధిగా కొనసాగించాలని సిరొంచ ప్రాంత మేడిగడ్డ బాధిత రైతులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులకు పోస్టు కార్డుల ద్వారా తమ గోడు వినిపించే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా తాము చేస్తున్న ఉద్యమం గురించి వివరిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండేకు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ అకౌంట్లకు ట్యాగ్ చేశారు. ట్విట్టర్ ద్వారా అయినా తమ సమస్యను గుర్తించి పరిష్కరిస్తారన్న ఆశతో ఉన్నామని సిరొంచ రైతులు తెలిపారు. 


Similar News