Sridhar Babu: ప్రతిపక్షాలు ఇకనైనా బుద్ది మార్చుకోవాలి.. మంత్రి శ్రీధర్ బాబు
దిశ, డైనమిక్ బ్యూరో: సంక్షోభ సమయంలో రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు తగదని, నష్టపోయిన ప్రతీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎంతో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరదలపై రివ్యూ చేశామని, వర్ష ప్రభావం ఎనిమిది జిల్లాలపై పడిందని, వరదల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టు వచ్చిందన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, బాధిత కుటుంబాలకు సాయాన్ని ఇప్పటికే ప్రకటించామని అన్నారు.
అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం చేయడం మానేసి ప్రతిపక్షాల నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సంక్షోభ సమయాల్లో వీలైతే బాధ్యత తీసుకొని సాయం చేయాలి కానీ రాజకీయం చేయడం తగదని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికైనా బుద్ది మార్చుకోవాలని, విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయడం మానేసి, ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని మోడీకి, అమిత్ షాకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఇక ఖమ్మంలో తీవ్ర ప్రభావం ఉండటం వల్ల జిల్లా మంత్రులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని, తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.