Job Calendar: జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీలో మంత్రీ శ్రీధర్ బాబు కీలక ప్రకటన.. సభలోకి స్కిల్ యూనివర్సిటీ బిల్లు

నిరుద్యోగులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేసింది.

Update: 2024-08-01 06:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని దాని ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఐటీ, పరిశ్రమలు, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. గురువారం శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలు కల్పించినా మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదన్నారు. పరిశ్రమలకు కావాల్సిన స్కిల్స్ గ్రాడ్యుయేట్లలో కొరవడ్డాయని పేర్కొన్నారు. నైపుణ్యం పెంపొందించేందుకు పారిశ్రామిక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో పలు దఫాలు చర్చించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపనకు ప్రతిపాదిస్తున్నామన్నారు. రాష్ట్రానికి సంబంధించి దాదాపు 30 లక్షల నిరుద్యోగులకు సంబధించిన ఈ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. వారి సలహాలు, సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ముచ్చర్లలో శాశ్వత క్యాంపస్:

ముచ్చర్లలో స్కిల్ యూనివర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయని, నైపుణ్యాలు, ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. 2024-25 సంవత్సరంలో 2 వేల మంది విద్యార్థులకు.. వచ్చే ఏడాది 10 వేల మందికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుందన్నారు. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఉతమిస్తుందన్నారు.

Tags:    

Similar News