RRR: త్రిబుల్ ఆర్ నిర్మాణ పనులను వేగవంతం చేయండి: మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఆర్ఆర్ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు) పనులను వేగవంతం చేయడంతోపాటు, నల్లగొండ బైపాస్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.

Update: 2024-07-22 14:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఆర్ఆర్ఆర్(రీజినల్ రింగ్ రోడ్డు) పనులను వేగవంతం చేయడంతోపాటు, నల్లగొండ బైపాస్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఢిల్లీలోని మోర్త్ కార్యాలయంలో సోమవారం జాతీయ రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల (మోర్త్) శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ను కలిశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రోడ్ల నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని టెండర్లు పిలిచి పనులను ప్రారంభించేందుకు అనుమతులను మంజూరు చేయాలని మంత్రి కోరారు. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్ ఆఫ్ సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని విజ్ఞప్తి చేశారు.

నల్గొండ టౌన్ పరిధిలోని ఎన్‌హెచ్-565పై వివిధ పాఠశాలల్లో చదివే పిల్లలు ఎఫ్ ఓబీ లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారని వెల్లడించారు. రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ రూ. 9 కోట్లతో ఎఫ్ ఓబీ ని ఏర్పాటు చేసేందుకు అంచనాలను రూపొందించిందని వివరించారు. ఎస్ ఎఫ్ సీ సమావేశం నిర్వహించి టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తే.. ఈ పనులన్నీ పూర్తవుతాయని అన్నారు. స్పందించిన అనురాగ్ జైన్ వారం రోజుల్లో ఎస్ ఎఫ్ సీ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News